H1B Visas : ‘హెచ్1 బీ’ వీసా కోటా పెంపు.. మోడీ, బైడెన్ చర్చలు
జీ7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు.
- Author : Pasha
Date : 15-06-2024 - 7:59 IST
Published By : Hashtagu Telugu Desk
H1B Visas : జీ7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు దాదాపు అరగంట పాటు చర్చలు జరిపారు. భారత్ – అమెరికా దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సంబంధాలపై బైడెన్, మోడీ ఈసందర్భంగా డిస్కస్ చేశారు. హెచ్1 బీ వీసా(H1B Visas) కోటా పెంపు అంశాన్ని మోడీ ప్రస్తావించారు. గతంలో ఈ కోటాను పెంచుతామని అమెరికా ఇచ్చిన హామీని భారత ప్రధాని గుర్తు చేశారు. భారత్‌లో గ్రీన్ ఎనర్జీ, రక్షణ రంగ పరికరాలు, ఎలక్ట్రిక్ కార్ల తయారీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాల గురించి బైడెన్‌కు మోడీ వివరించారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై డిస్కషన్
వ్యూహాత్మక భాగస్వామ్యంతో భారత్, అమెరికా కలిసి ముందుకు సాగేందుకు అవకాశమున్న రంగాల గురించి మోడీ, బైడెన్ మాట్లాడారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపైనా మాట్లాడుకున్నారు. నేడు, రేపు స్విట్జర్లాండ్ వేదికగా జరగనున్న శాంతి సదస్సుపై బైడెన్, మోడీ చర్చించుకున్నారు. ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం ఆగేందుకు ఉన్న అవకాశాలపై ఇద్దరు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కాగా, ఇటలీలోని అపూలియాలో జీ7 దేశాల సదస్సు జరుగుతోంది. మూడో విడత ప్రధానిగా మోడీ బాధ్యతలను స్వీకరించిన తరువాత ఆయన చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే.
We’re now on WhatsApp. Click to Join
సదస్సు విశేషాలు
- జీ7లో అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్ దేశాలకు సభ్యత్వం ఉంది. భారత్‌కు సభ్యత్వం లేదు.
- ప్రత్యేక ఆహ్వానితుడి హోదాలో ఈ సదస్సులో భారత ప్రధాని మోడీ పాల్గొన్నారు.
- జీ7 సదస్సు నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకున్న వారిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ, ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సుల వాన్ డెర్, పోప్ ఫ్రాన్సిస్ తదితరులు ఉన్నారు.
- బ్రిటన్, కెనడా, జపాన్ ప్రధానమంత్రులు రిషి సునాక్, జస్టిన్ ట్రూడో, ఫ్యుమియో కిషిడ, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ ష్కాల్జ్ ఈ సమ్మిట్‌కు హాజరయ్యారు. జీ7కు ఇటలీ ప్రధానమంత్రి మెలోనీ అధ్యక్షత వహించారు.