Mallikarjun Kharge: ‘బక్రీద్‌లో బతికితే మొహర్రంలో డ్యాన్స్ చేస్తా’..!!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున ఖర్గే..సంచలన వ్యాఖ్యలు చేశారు.
- By hashtagu Published Date - 10:13 PM, Wed - 12 October 22

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున ఖర్గే..సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం చెప్పలేదు. ఈ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘బక్రీద్ మే బచాయేంగే తో ముహర్రం మే నాచ్నేగే’ అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేను సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ‘బక్రీద్‌లో బతికితే ముహర్రంలో నాట్యం చేస్తా’ అనే సామెత ఉంది. ముందు ఈ ఎన్నికలు ముగిశాక…అధ్యక్షుడు ఎవరనేది ఆలోచిద్దాం అంటూ సమాధానం ఇచ్చారు.
పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేసిన ఖర్గేకు ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ నుంచి పోటీ ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఖర్గే కాంగ్రెస్ ప్రతినిధులతో సమావేశమై తమకు అనుకూలంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సమిష్టి నాయకత్వాన్ని నమ్ముతానని ఖర్గే అన్నారు.
గాంధీ కుటుంబ సభ్యులు పార్టీ అధ్యక్ష పదవికి అంగీకరించడం లేదని, అందుకే పార్టీ కార్యకర్తలు, సీనియర్ నేతలు తనను ఆ పదవికి పోటీ చేయాలని అభ్యర్థించారని ఖర్గే చెప్పారు. అందుకే ఎన్నికల బరిలోకి దిగినట్లు తెలిపారు. ఈ క్రమంలో పార్టీ ఉదయ్‌పూర్ మేనిఫెస్టోను అమలు చేస్తానని మరోసారి హామీ ఇచ్చారు. ‘పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఉదయ్‌పూర్ మేనిఫెస్టోను అమలు చేస్తాను’ అని చెప్పారు.
ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. సంస్థాగత ఎన్నికల వరకు శశిథరూర్‌కు వ్యతిరేకంగా తాను రంగంలో ఉన్నానని, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. తామిద్దరం కలిసి బీజేపీపై పోరాడతామని స్పష్టం చేశారు.