India Pakistan War: ఆస్పత్రుల భవనాలపై ‘రెడ్ క్రాస్’ సింబల్స్ పెయింటింగ్ ఎందుకు వేస్తున్నారు..? జెనీవా ఒప్పందంలో ఏముంది..?
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధ సమయంలో ఆస్పత్రులపై దాడి జరగకుండా ఉండేందుకు ..
- By News Desk Published Date - 05:15 PM, Fri - 9 May 25

India Pakistan War: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తీవ్రమయ్యాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో భారత్ లోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ ఆర్మీ దాడులకు పాల్పడుతుంది. గురువారం పాకిస్థాన్ దాడులను భారత్ ఆర్మీ తిప్పికొట్టింది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్ లోని ఆస్పత్రుల భవనాలపై ‘రెడ్ క్రాస్’ సింబల్స్ పెయింటింగ్ లను పెద్దసైజులో వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రభుత్వ ఆస్పత్రుల భవనాలపై రెడ్ క్రాస్ సింబల్స్ ను పెయింట్ చేస్తున్నారు. అయితే, యుద్ధ సమయంలో ఈ సింబల్స్ వేయడం ద్వారా ఉపయోగాలు ఉన్నాయి.
Also Read: Indus Waters Treaty : సింధు జల ఒప్పందంపై పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రపంచ బ్యాంక్
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధ సమయంలో ఆస్పత్రులపై దాడి జరగకుండా ఉండేందుకు ఆస్పత్రి భవనాలపై పెద్ద సైజులో రెడ్ క్రాస్ గుర్తును పెయింటింగ్ వేయిస్తారు. దీని వల్ల విమానాలు, జెట్ లు, డ్రోన్లు ద్వారా ఆస్పత్రులను సులభంగా గుర్తించవచ్చు. జెనీవా ఒప్పందం ప్రకారం.. ఈ రెడ్ క్రాస్ గుర్తు ఉన్న భవనాలపై శత్రు దేశాలు దాడి చేయకూడదు. దేశంలో యుద్ధం జరుగుతున్నప్పటికీ.. పౌరులకు, సైనిక సిబ్బందికి అందే వైద్య సేవలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలు ఈ మానవతా ఒప్పందం చేసుకున్నాయి. 1949లో ఈ ఒప్పందం జరిగింది. ఎవరైనా అతిక్రమిస్తే దానిని యుద్ధ నిబంధనల ఉల్లంఘన కింద పరిగణిస్తారు. అందుకు తగిన చర్యలు ఆయా దేశాలపై ఉంటాయి.
Also Read: Territorial Army : కేంద్రం మరో కీలక నిర్ణయం..రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ.. !
జమ్మూ కాశ్మీర్‌లోని అధికారులు సరిహద్దు జిల్లాల్లోని ఆసుపత్రుల పైకప్పులపై అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రెడ్‌క్రాస్ చిహ్నాన్ని పెయింట్ చేయించారు. తాజాగా.. తెలంగాణ రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య శాఖ ఆస్పత్రి భవనాలపై రెడ్ క్రాస్ సింబల్స్ పెయింట్ వేయిస్తుంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని ఆస్పత్రుల భవనాలపై రెడ్ క్రాస్ సింబల్స్ వేస్తున్నారు. ఇప్పటి వరకు 164 వైద్య ఆరోగ్య శాఖ భవనాలపై ఈ సింబల్స్ ను పెయింటింగ్ చేయించారు. మిగిలిన ఆస్పత్రుల్లో రెండ్రోజుల్లో పెయింటింగ్ పనులు పూర్తిచేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.