Gyanvapi Mosque : హిందూ ఆలయంపైనే జ్ఞానవాపి మసీదు.. ఏఎస్‌ఐ సంచలన నివేదిక
Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) నిర్వహించిన సర్వేకు సంబంధించిన సంచలన నివేదిక బయటికి వచ్చింది.
- By Pasha Published Date - 07:19 AM, Fri - 26 January 24

Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) నిర్వహించిన సర్వేకు సంబంధించిన సంచలన నివేదిక బయటికి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకొని ఉన్న జ్ఞానవాపి మసీదు సముదాయంలో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) టెక్నాలజీతో ఏఎస్‌ఐ సర్వే చేసింది. ఆ మసీదు సముదాయం ప్రదేశంలో గతంలో పెద్ద హిందూ దేవాలయం ఉండేదని నివేదికలో ప్రస్తావించారు. ఈవిషయాన్ని హిందువుల పక్షం తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మీడియాకు వెల్లడించారు. ఏఎస్ఐ నివేదిక ప్రకారం ఆయన తెలిపిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
ఏఎస్ఐ నివేదిక ప్రకారం..
- హిందూ దేవాలయం ఆనవాళ్లు కనిపించకుండా జ్ఞానవాపి మసీదులో(Gyanvapi Mosque) ఎన్నో మార్పులు చేశారు.
- చిన్న చిన్న మార్పులతో ఆలయానికి చెందిన స్తంభాలు, ప్లాస్టర్‌లనే ఈ మసీదులో ఉపయోగించారు.
- ఆలయం నుంచి తీసుకొని వాడుకున్న స్తంభాలపై ఉన్న చిత్రాలను తొలగించడానికి ప్రయత్నాలు జరిగిన ఆనవాళ్లు కూడా సర్వేలో లభ్యమయ్యాయి.
- దేవనాగరి, తెలుగు, కన్నడ, ఇతర లిపులలో రాసిన పురాతన హిందూ దేవాలయ శాసనాలు కూడా లభ్యమయ్యాయి.
- ‘‘మసీదు సముదాయంలో ఏఎస్ఐ నిర్వహించిన సర్వేలో 34 రాతి శాసనాలు బయటపడ్డాయి. 32 స్టాంప్డ్ పేజీలు దొరికాయి. శాసనాలలో జనార్ధన, రుద్ర, ఉమేశ్వర అనే ముగ్గురు దేవతల పేర్లు ఉన్నాయి.
- జ్ఞానవాపి మసీదు కంటే ముందు అక్కడున్న నిర్మాణాన్ని ధ్వంసం చేసి.. దానిలోని పనికొచ్చే భాగాలు, రాతి శాసనాలు, స్తంభాలను నిర్మాణ మెటీరియల్‌లో తిరిగి వాడినట్లుగా ఏఎస్‌ఐకు ఆధారాలు దొరికాయి.
We’re now on WhatsApp. Click to Join.
అప్పటికే ఉన్న ఆలయ నిర్మాణంపై జ్ఞానవాపి మసీదును 17వ శతాబ్దంలో నిర్మించారంటూ హిందూ పిటిషనర్లు వేసిన పిటిషన్ ఆధారంగా శాస్త్రీయ సర్వే నిర్వహణకు గతేడాది న్యాయస్థానం ఆదేశించింది . దీంతో మసీదు సముదాయంలో ఏఎస్ఐ సర్వే నిర్వహించింది. ఈ సర్వే నివేదికను హిందూ , ముస్లిం పక్షాలకు ఇవ్వాలని వారణాసి కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చిన ఒక రోజు తర్వాత సంచలన నివేదికలోని వివరాలు వెలుగులోకి వచ్చాయి.