Tragedy : ఘజియాబాద్‌లో దారుణం.. భార్యను ‘నోరా ఫతేహీలా ఉండాలి’ అంటూ చిత్రహింసలు
Tragedy : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో ఒక భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ నటి నోరా ఫతేహీ అందం, శరీరాకృతి తన భార్యలో ఉండాలని కోరుకున్న ఓ భర్త ఆమెను నిత్యం శారీరక, మానసిక చిత్రహింసలకు గురి చేశాడు.
- By Kavya Krishna Published Date - 11:06 AM, Thu - 21 August 25

Tragedy : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో ఒక భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ నటి నోరా ఫతేహీ అందం, శరీరాకృతి తన భార్యలో ఉండాలని కోరుకున్న ఓ భర్త ఆమెను నిత్యం శారీరక, మానసిక చిత్రహింసలకు గురి చేశాడు. అందంగా లేవంటూ, లావుగా ఉన్నావంటూ అవమానాలు చేస్తూ, బలవంతంగా గంటల తరబడి వ్యాయామం చేయించేవాడు. గర్భం దాల్చిన తర్వాత కూడా బలవంతంగా గర్భస్రావం చేయించాడని బాధితురాలు కన్నీటి పర్యంతమై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలు షాను (26) తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఏడాది మార్చి 6న ఆమె ఘజియాబాద్‌కు చెందిన ప్రభుత్వ పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ శివమ్ ఉజ్వల్ను వివాహం చేసుకుంది. పెళ్లి సమయంలో ఆమె కుటుంబం రూ.77 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలు, స్కార్పియో కారును వరకట్నంగా ఇచ్చారు. అయితే, పెళ్లయిన కొన్ని రోజులు గడవకముందే అత్తింటి అసలు స్వరూపం బయటపడిందని ఆమె వాపోయింది.
షాను ఆరోపణల ప్రకారం, భర్త శివమ్ తన శరీరాకృతి నటి నోరా ఫతేహీలా నాజూకుగా ఉండాలని పట్టుబట్టేవాడు. రోజూ కనీసం మూడు గంటలపాటు జిమ్ వ్యాయామం చేయమని ఒత్తిడి చేసేవాడు. వ్యాయామం మానేస్తే, భోజనం పెట్టకుండా మాడ్చేస్తూ శారీరకంగా, మానసికంగా హింసించేవాడు.
Teenmar Mallanna : తెలంగాణ రాజకీయాల్లో బీసీల కొత్త శకం ప్రారంభమా? తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన..!
అంతేకాకుండా, శివమ్ తరచూ ఇతర మహిళల అసభ్యకర వీడియోలు చూసేవాడని, భార్యకు అవమానకరమైన మాటలు చెప్పేవాడని షాను వాపోయింది. చిన్న చిన్న విషయాలకే చేయి చేసుకునేవాడని, అత్తింటివారు కూడా భర్తను సమర్థించేవారని ఆరోపించింది. బాధితురాలు మరో షాకింగ్ అంశాన్ని వెల్లడించింది. తన మామ కేపీ సింగ్ ఎలాంటి సమాచారం లేకుండా తరచూ వారి బెడ్‌రూమ్‌లోకి వచ్చేవాడని, ఇది తనకు తీవ్ర అసౌకర్యంగా ఉండేదని తెలిపింది. ఇలాంటి వాతావరణంలో జీవించడం అసహనంగా మారిందని ఫిర్యాదులో పేర్కొంది.
షాను తెలిపిన ప్రకారం, తాను గర్భం దాల్చిన తర్వాత అత్తింటివారు అసహనం వ్యక్తం చేశారు. కొద్ది రోజులకే ఆడపడుచు బలవంతంగా ఒక మాత్ర మింగించిందని, ఇంటర్నెట్‌లో వెతికినప్పుడు అది అబార్షన్ పిల్ అని తెలిసిందని పేర్కొంది. అనంతరం పెరుగులో మసాలాలు కలిపి తినిపించడం వల్ల తన ఆరోగ్యం క్షీణించి జూలై 9న ఆసుపత్రికి వెళ్లగా, వైద్యులు గర్భస్రావం జరిగిందని నిర్ధారించారని ఆమె తెలిపింది.
జూన్ 18న షాను తల్లిదండ్రులు ఆమెను పుట్టింటికి తీసుకెళ్లారు. అనంతరం జూలై 26న తిరిగి అత్తింటికి వెళ్లినప్పుడు, ఇంటిలోకి రానివ్వకుండా గెంటేశారని చెప్పింది. తన ఆభరణాలు, వస్తువులు కూడా తిరిగి ఇవ్వలేదని బాధతో పేర్కొంది. చివరికి విసిగిపోయిన షాను, ఈ నెల 14న భర్త శివమ్, అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, గృహ హింస, బలవంతపు గర్భస్రావం ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Ganesh Chaturthi 2025 : గణేష్ భక్తులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్