Credit Card: ఈ క్రెడిట్ కార్డు వాడే వారికి బంపరాఫర్..!
ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడే వారికి తీపికబురు.
- By hashtagu Published Date - 02:03 PM, Tue - 1 November 22

ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడే వారికి తీపికబురు. ఎందుకంటే బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.ఫెడరల్ బ్యాంక్ సోమవారం ఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో కలిసి తన క్రెడిట్ కార్డ్ హోల్డర్ల కోసం సాచెట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ ‘గ్రూప్ క్రెడిట్ షీల్డ్’ను ప్రారంభించింది. బీమా ఉత్పత్తి ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా క్రెడిట్ కార్డు వాడే వారికి లైఫ్ ఇన్సూరెన్స్ లభించనుంది.
గ్రూప్ క్రెడిట్ షీల్డ్ కింద బీమా కవర్ క్రెడిట్ పరిమితికి సమానం. గరిష్ట పరిమితి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. అంటే క్రెడిట్ కార్డ్ హోల్డర్‌కు రూ. 3 లక్షల కంటే ఎక్కువ క్రెడిట్ పరిమితి ఉన్నప్పటికీ, వారు గరిష్టంగా రూ. 3 లక్షల కవరేజీని పొందుతారు. లైఫ్ కవర్ ఒక సంవత్సరం మాత్రమే కాలపరిమితితో వస్తుంది. అంటే ప్రతి ఏడాది రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఫెడరల్ బ్యాంక్ మూడు రకాల క్రెడిట్ కార్డులను కస్టమర్లకు అందిస్తోంది. సెలెస్టా, ఇంపెరియో, సిగ్నెట్ అనేవి ఇవి. వీసా, మాస్టర్ కార్డ్, రూపే సంస్థలతో భాగస్వామ్యం ద్వారా ఫెడరల్ బ్యాంక్ ఈ క్రెడిట్ కార్డులను తీసుకువచ్చింది. ఫెడరల్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. ఏజియస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తుంది. ఇది ఫెడరల్ బ్యాంక్, ఏజియస్ ఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్.
ప్రీమియం విషయానికి వస్తే.. 20 ఏళ్ల వయసులో ఉన్న వారికి రూ. 3 లక్షల కవరేజ్‌కు రూ. 604 ప్రీమియం పడుతుంది. అదే రూ. 2 లక్షలకు అయితే రూ. 403, రూ.లక్షకు అయితే రూ. 201 చెల్లించుకోవాల్సి ఉంటుంది. అదే 60 ఏళ్ల వరకు వయసులో ఉన్న వారికి అయితే రూ.లక్షకు రూ. 1958, రూ. 2 లక్షలకు రూ. 3916, రూ. 3 లక్షలకు రూ. 5874 ప్రీమియం కట్టాలి. అలాగే 30 ఏళ్ల వయసులో ఉన్న వారు అయితే రూ. 3 లక్షల మొత్తానికి రూ. 631 కడితే సరిపోతుంది. రూ.లక్షకు రూ. 210, రూ. 2 లక్షలకు రూ. 421 ప్రీమియం చెల్లించాలి. క్రెడిట్ కార్డు వాడే వారు మరణిస్తే.. ఆ క్రెడిట్ కార్డు బిల్లు భారం లేకుండా చూసుకోవాలని భావించే వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. తద్వారా కుబుంబంపై ఆర్థిక భారం పడదు. ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.