Manipur Minister – Explosion : మంత్రి ఇంటిపై గ్రెనేడ్ దాడి.. ఇద్దరికి గాయాలు.. సంఘటనా స్థలికి సీఎం
Manipur Minister - Explosion : మణిపూర్ లో విధ్వంసకాండ కొనసాగుతోంది.
- By Pasha Published Date - 03:18 PM, Sun - 8 October 23

Manipur Minister – Explosion : మణిపూర్ లో విధ్వంసకాండ కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లోని ఆ రాష్ట్ర మంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ ఇంటి ఎదుట బాంబు పేలింది. ఆయన నివాసం వెలువల గేటుపైకి ఓ దుండగుడు గ్రెనేడ్ విసిరాడు. అది వెంటనే పేలడంతో సీఆర్పీఎఫ్ జవాన్, స్థానిక మహిళ గాయపడ్డారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఎం స్వయంగా పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. మంత్రి ఇంటి వద్ద భద్రతను మరింత పెంచారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేసి నిందితుడ్ని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి పది గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఆలస్యంగా ఆదివారం ఉదయం వెలుగుచూశాయి.
We’re now on WhatsApp. Click to Join
గత ఐదు నెలలుగా ఇంటర్నెట్ సేవలకు దూరమైన మణిపూర్ లో మరోసారి ఇంటర్నెట్‌పై నిషేధాన్ని పొడిగించారు. ఈ నెల 11 వరకు నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలోనే నిషేధాన్ని పొడిగించినట్టు తెలిపారు. ఇద్దరు మైతై తెగ విద్యార్థుల హత్యకు నిరసనగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై సాయుధ బలగాలు ఇటీవల విరుచుకుపడ్డాయి. పెల్లెట్ గన్నులతో జవాన్లు కాల్పులు జరపగా.. జాతీయ క్రీడాకారుడు ఉత్తమ్ సాయిబామ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తలలోకి 61 మేకులు దిగాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తిరిగి అతడు మైదానంలో దిగుతాడో లేదో తెలియడం లేదు. దీంతో బీజేపీ సర్కార్‌పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. సాయుధ దళాలు రాష్ట్ర పరిధిలోకి రావని, వారిని నియంత్రించే అధికారం తనకు లేదని మణిపూర్ సీఎం చేతులు దులుపుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.