Russian Missile : అమెరికాకు దడపుట్టిస్తున్న .. రష్యా ఖండాంతర మిస్సైల్ ‘సర్మాత్’
ఉక్రెయిన్ కు అమెరికా, నాటో దేశాలు అధునాతన ఆయుధాలను సరఫరా చేస్తున్న నేపథ్యంలో.. వాటికి రష్యా ఒక బలమైన సందేశాన్ని పంపింది.
- By Hashtag U Published Date - 04:57 PM, Thu - 21 April 22
– విజయవంతంగా పరీక్షించిన పుతిన్ సేన
– ‘ హ్యాష్ ట్యాగ్ యూ’ ప్రత్యేక కథనం
ఉక్రెయిన్ కు అమెరికా, నాటో దేశాలు అధునాతన ఆయుధాలను సరఫరా చేస్తున్న నేపథ్యంలో.. వాటికి రష్యా ఒక బలమైన సందేశాన్ని పంపింది. దానిపేరే.. ‘ ఆర్ఎస్-28 సర్మాత్’ !! ఈ ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ ను రష్యా విజయవంతంగా పరీక్షించిందనే వార్త సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ విడుదల చేసిన ఒక ప్రకటన కూడా ప్రకంపనలు రేపుతోంది. ” ఆర్ఎస్-28 సర్మాత్ మిసైల్ పరీక్షను చూసి రష్యా శత్రువులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. దాని సామర్ధ్యం ఏమిటో తెలుసుకోవాలి. రష్యా శత్రువులకు ఎంత ముప్పు ఉందో గ్రహించాలి. ” అని పుతిన్ హెచ్చరించారు.
ప్రత్యేకతలు.. ప్రణాళికలు..
ఆర్ఎస్-28 సర్మాత్ అనేది ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్. ప్రపంచ పటంలోని ఖండాలను అవలీలగా దాటుకుంటూ దూసుకెళ్లే సామర్ధ్యం కారణంగా దీన్ని ఖండాంతర మిస్సైల్ అంటారు. దాదాపు 11,000 నుంచి 18,000 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలను కూడా ‘సర్మాత్’ లక్ష్యంగా చేసుకోగలదు. ధ్రువ ప్రాంతాల మీదుగానూ దీన్ని ప్రయోగించే వెసులుబాటు ఉంది. 10 కంటే ఎక్కువ వార్ హెడ్ లను మోసుకెళ్లే సామర్ధ్యం ‘సర్మాత్’ సొంతం. ప్రతి వార్ హెడ్ పేలుడు సామర్ధ్యం 0.75 మెట్రిక్ టన్నులు. ఈ మిస్సైల్ చిన్నపాటి హైపర్ సోనిక్ బూస్ట్ గ్లైడ్ వెహికిల్స్ ను కూడా మోసుకెళ్లగలదు. రాడార్ వ్యవస్థలకు చిక్కకుండా.. అకస్మాత్తుగా దారిని మార్చుకొని వెళ్లే పరిజ్ఞానం ఇందులో ఉంది. ప్రస్తుతం రష్యా అమ్ములపొదిలో ఉన్న ‘ R-36M వొయేవోడా ‘ ఖండాంతర మిస్సైల్ కంటే ఆర్ఎస్-28 ప్రమాదకరమైంది. అమెరికా వద్దనున్న ఖండాంతర మిస్సైళ్ల లో ఘనరూప ఇంధన వ్యవస్థ ఉండగా.. రష్యా తాజాగా పరీక్షించిన ఆర్ఎస్-28 సర్మాత్ లో ద్రవరూప ఇంధన వ్యవస్థ ఉంది. అమెరికా,నాటో దేశాల భూ, శాటిలైట్ ఆధారిత రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ కంట్లో పడకుండా తప్పించుకునే సామర్ధ్యం కూడా దీనికి ఉంది. వాస్తవానికి ఆర్ఎస్-28 సర్మాత్ కు సంబంధించిన అభివృద్ధి పనులను 2009 నుంచే రష్యా ప్రారంభించింది. అయితే 2016 సంవత్సరంలో ఈ ప్రాజెక్టు కు సంబంధించిన పలు ఫోటోలు విడుదలయ్యాయి. ఆర్ఎస్-28 సర్మాత్ మిస్సైళ్లను మరో ఐదుసార్లు పరీక్షించిన తర్వాతే .. 2022 చివరికల్లా రష్యా వాయుసేనకు అప్పగించనున్నారు.
సర్మాత్ అంటే..
మధ్యయుగ కాలం తొలినాళ్లలో ఇరాన్ వైపు నుంచి దక్షిణ రష్యా కు వలస వచ్చిన ఒక సంచారజాతి పేరు ‘సర్మాత్’. యుద్ధ నైపుణ్యం, గుర్రపు స్వారీ లో వారిది అందె వేసిన చేయి. 2వ శతాబ్దంకల్లా సర్మాత్ సంచార జాతివాళ్ళు యావత్ దక్షిణ రష్యాపై పట్టు సంపాదించారు. ఈనేపథ్యంలోనే ఖండాంతర మిసైల్ కు సర్మాత్ అనే పేరు పెట్టారు.
Related News
Nuclear Weapons Race : ఆ మూడు దేశాలతో దడ.. అణ్వాయుధాలను పెంచుతాం: అమెరికా
ఉత్తర కొరియా, చైనా, రష్యాలు అణ్వాయుధ నిల్వలను వేగంగా పెంచుకుంటున్నాయని అమెరికా వైట్ హౌస్ ఆరోపించింది.