Surya Kant : ఆనాడు రైతు బిడ్డ ..నేడు CJI..సూర్యకాంత్ జీవన ప్రయాణం ఎందరికో ఆదర్శం
Surya Kant : భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) గా జస్టిస్ సూర్యకాంత్ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు
- By Sudheer Published Date - 11:26 AM, Mon - 24 November 25
భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) గా జస్టిస్ సూర్యకాంత్ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ సూర్యకాంత్ ఫిబ్రవరి 9, 2027 వరకు సీజేఐ పదవిలో కొనసాగుతారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి, అత్యున్నత న్యాయస్థానం అధిపతిగా బాధ్యతలు చేపట్టడం ఆయన పట్టుదలకు నిదర్శనం.
Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్..ఆ హోటల్ వెబ్‌సైట్ ఫేక్?
జస్టిస్ సూర్యకాంత్ ప్రస్థానం న్యాయరంగంలో ఆయన నిబద్ధతను తెలియజేస్తుంది. ఆయన 1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిసార్ జిల్లాలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. న్యాయ విద్య అనంతరం, ఆయన హిసార్ జిల్లా కోర్టులో లాయర్‌గా తన ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. ఆ తరువాత పంజాబ్, హరియాణా హైకోర్టులో లాయర్‌గా కొనసాగారు. 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, ఆయన రాజ్యాంగపరమైన అంశాలు, ఎన్నికల సంస్కరణలు వంటి కీలక కేసుల విచారణలో తనదైన ప్రత్యేక ముద్ర వేసి, న్యాయ నిపుణుడిగా గుర్తింపు పొందారు.
53వ సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్ అనేక కీలక తీర్పులలో భాగస్వామిగా నిలిచారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు, పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛ, అవినీతి, పర్యావరణ పరిరక్షణ, మరియు లింగ సమానత్వం వంటి ప్రధాన అంశాలపై ఆయన సభ్యుడిగా ఉన్న ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులు దేశవ్యాప్తంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అంతేకాకుండా, వివాదాస్పదమైన దేశద్రోహ చట్టాన్ని నిలిపివేసిన చరిత్రాత్మక ధర్మాసనంలో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఈ చట్టం కింద కొత్త ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయవద్దని ఆదేశించిన ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ భాగస్వామ్యం కావడం ఆయన పౌర హక్కుల పరిరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది.