NEET Exam : 1,563 మంది నీట్ అభ్యర్థుల గ్రేస్ మార్కులు రద్దు.. వారికి రీటెస్ట్ : కేంద్రం
‘నీట్ - యూజీ 2024’ పరీక్ష రాసి గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థుల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
- By Pasha Published Date - 11:54 AM, Thu - 13 June 24

NEET Exam : ‘నీట్ – యూజీ 2024’ పరీక్ష రాసి గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థుల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ అందరు అభ్యర్థుల స్కోర్‌కార్డులను రద్దు చేయనున్నట్లు వెల్లడించింది. ఈవిషయాన్ని గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. నీట్ – యూజీ పరీక్షా ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయంటూ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువకులు ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. గ్రేస్ మార్కుల కేటాయింపు అన్యాయంగా జరిగిందని.. పరీక్ష నిర్వహణకు ముందు గ్రేస్ మార్కులపై ఎలాంటి ప్రకటన కూడా చేయలేదని వారు పిటిషన్‌లో ఆరోపించారు. దీనికి స్పందనగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం బదులిస్తూ ఈ వివరాలను వెల్లడించింది. ‘‘గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తున్నాం. ఇందుకు ప్రత్యామ్నాయంగా వారు మళ్లీ పరీక్ష రాయొచ్చు. జూన్ 23న పరీక్ష నిర్వహిస్తాం. జూన్ 30న ఫలితాలను విడుదల చేస్తాం’’ అని కేంద్ర సర్కారు తెలిపింది. నీట్ యూజీ కౌన్సెలింగ్ ముందస్తు షెడ్యూల్ ప్రకారం నిరాటంకంగా కొనసాగుతుందని కేంద్రం(NEET Exam) తేల్చి చెప్పింది.
We’re now on WhatsApp. Click to Join
‘‘నీట్ పరీక్షల నిర్వహణ, గ్రేస్ మార్కుల వ్యవహారాన్ని సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాం. అది ఈనెల 10,11, 12 తేదీల్లో సమావేశమై ఆయా అంశాలను సమీక్షించింది. అంతర్గత విచారణ నిర్వహించి పూర్తి వివరాలు సేకరించింది. ఆ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగానే గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేశాం’’ అని సుప్రీంకోర్టుకు కేంద్ర సర్కారు తెలిపింది.
Also Read : 120 Million People Displaced : 12 కోట్ల మంది గూడు చెదిరింది.. ఐరాస సంచలన నివేదిక
ఈసందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు ఆటంకం కలగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఎలాాంటి అంతరాయం లేకుండా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అమలు చేయాలని స్పష్టం చేసింది. గ్రేస్ మార్కులు రద్దయిన విద్యార్థులు.. వారికి అవసరమని భావిస్తే మళ్లీ పరీక్ష రాస్తారని పేర్కొంది.