Ayushman Bharat : ‘ఆయుష్మాన్ భారత్’ ఆరోగ్య బీమా పరిమితి రూ.10 లక్షలకు పెంపు ?
Ayushman Bharat : ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇచ్చే ఆరోగ్య బీమాను కేంద్ర సర్కారు రూ. 10 లక్షలకు పెంచనుందని సమాచారం.
- By Pasha Published Date - 05:58 PM, Wed - 17 January 24

Ayushman Bharat : ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇచ్చే ఆరోగ్య బీమాను కేంద్ర సర్కారు రూ. 10 లక్షలకు పెంచనుందని సమాచారం. క్యాన్సర్, అవయవ మార్పిళ్లు లాంటి వాటి చికిత్సకు అయ్యే ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇచ్చే ఆరోగ్య బీమాకు(Ayushman Bharat) రూ.5లక్షల పరిమితి ఉంది. ఇదే త్వరలో డబుల్ కానుందన్న మాట. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్లో దీనిపై ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఆయుష్మాన్ భారత్ లబ్దిదారుల సంఖ్యను కూడా 100 కోట్లకు పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే మూడేళ్లలో కిసాన్ సమ్మాన్ నిధి, భవన నిర్మాణ రంగ కార్మికులు, నాన్ కోల్‌మైన్ వర్కర్స్, ఆశా వర్కర్స్‌ను ఈ పథకంలో భాగం చేయాలని సర్కారు యోచిస్తోంది. రూ. 10 లక్షల చొప్పున 100కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే ఈ స్కీమ్ అమలుకు ఏటా సుమారు రూ.12,076కోట్లు అదనంగా ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా వచ్చే బడ్జెట్లో కేటాయింపులను పెంచనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.7,200కోట్లు కేటాయించగా, ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.15,000కోట్లకు పెంచే ఛాన్స్ ఉంది. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం 2018లో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 6.2 కోట్ల ఆస్పత్రులు ఇందులో చేరాయి. రూ.79,157కోట్ల విలువైన చికిత్సలు జరిగాయి. జనవరి 12 నాటికి 30కోట్ల మంది ఆయుష్మాన్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నారు.
Also Read: 10 Strongest Currencies : టాప్-10 పవర్‌ఫుల్ కరెన్సీల లిస్టు ఇదే.. ఇండియా ర్యాంక్ తెలుసా ?
ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 1.52 కోట్ల కార్డులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. అత్యధిక కార్డులున్న రాష్ట్రాల్లో ఏపీ 9వ స్థానంలో నిలిచినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ‘ఈ నెల 12 నాటికి దేశ వ్యాప్తంగా 30కోట్ల కార్డులు నమోదవగా.. 4.8కోట్ల కార్డులతో ఉత్తర్‌ప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి. ఆసుపత్రి అడ్మిషన్లలో తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లు వరుస స్థానాల్లో నిలిచాయి. ఏపీలో ఇప్పటివరకు 49.67 లక్షల ఆసుపత్రి అడ్మిషన్లు జరిగాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా అత్యధికంగా 64.05 లక్షల మందికి డయాలసిస్ చికిత్సలు జరిగాయి. దీని కింద కేంద్ర ప్రభుత్వం ఏటా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య కవరేజి ఇస్తోంది.