Vice President: కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి?
రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. ద్రౌపది ముర్మునూ గెలిపించుకోవడం బీజేపీకి పెద్ద కష్టం కాదన్న అభిప్రాయం ఉంది.
- Author : Hashtag U
Date : 02-07-2022 - 8:44 IST
Published By : Hashtagu Telugu Desk
రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. ద్రౌపది ముర్మునూ గెలిపించుకోవడం బీజేపీకి పెద్ద కష్టం కాదన్న అభిప్రాయం ఉంది. అందుకే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఫోకస్ పెట్టింది. దీనికోసం పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుు ఉన్నారు. ఆయన పదవీకాలం ఆగస్టు 10తో ముగుస్తుంది. కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఈమధ్యే షెడ్యూల్ కూడా వచ్చింది. ఈనెల 5 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఆగస్టు 6న ఎన్నిక ఉంటుంది. అదే రోజున ఫలితాలు ఉంటాయి.
అమరీందర్ సింగ్ పేరు ప్రస్తావనకు రావడం వెనుక కథ చాలా చాకచక్యంగా నడిచింది. పంజాబ్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఆయనే సీఎంగా ఉండేవారు. కానీ అప్పుడు ఆ పార్టీ చీఫ్ నవ జ్యోత్ సింగ్ సిద్దూతో పడకపోవడం, ఇతరత్రా కారణాలతో అధిష్టానం ఆయనను సీఎం పోస్టు నుంచి తప్పించింది. దీంతో ఆయన వేరు కుంపటి పెట్టారు. దాని పేరు పంజాబ్ లోక్ కాంగ్రెస్-పీఎల్పీ.
అమరీందర్ సింగ్ వెన్నెముక చికిత్స కోసం లండన్ లో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని మోదీ ఇప్పటికే వాకబు చేశారు. అమరీందర్ తిరిగి వచ్చిన తరువాత ఎన్డీఏ ఆయననే వైస్ ప్రెసిడెంట్ రేసులో నిలబెట్టే ఛాన్సుంది. పైగా అమరీందర్ కార్యాలయం కూడా ఈ మేరకు ఓ ప్రకటన చేయడంతో దాదాపుగా ఆయన పోటీ షురూ అన్నట్టుగానే ఉంది. దీనికన్నా ముందుగా అమరీందర్ తన పార్టీ అయిన పీఎల్పీని బీజేపీలో విలీనం చేయడానికి కూడా రంగం సిద్ధమైంది. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసినా ఒక్క సీటు కూడా రాలేదు. పైగా పటియాలా నుంచి పోటీ చేసిన ఆయనే స్వయంగా ఓడిపోయారు.