Delhi Fire: ఢిల్లీలో ఘోరఅగ్నిప్రమాదం…26మంది మృతి…?
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
- By Hashtag U Updated On - 12:14 AM, Sat - 14 May 22

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ముండ్కా మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలోని మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని 26 మంది సజీవ దహనమయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 24 ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. దాదాపు 70 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది భవనం కిటికీలను పగులగొట్టి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు.
భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో పాటు సీసీటీవీ కెమెరా, రూటర్ కంపెనీ కార్యాలయంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. అనంతరం మంటలు రెండో అంతస్తుకు వ్యాపించినట్లు తెలుస్తోంది. మరోవైపు కంపెనీ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే వివిధ శాఖల అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.