Inability To Swallow: ఆహారాన్ని మింగలేక పోతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?
మాములుగా అప్పుడప్పుడు కొంతమందికి మీరు తాగినప్పుడు లేదా ఆహారం తిన్నప్పుడు ఎంగిలి మింగినప్పుడు కూడా గొంతులో నొప్పిగా ఉండి మింగలేకపోతూ ఉంటారు.
- By Anshu Published Date - 10:30 PM, Tue - 11 July 23

మాములుగా అప్పుడప్పుడు కొంతమందికి మీరు తాగినప్పుడు లేదా ఆహారం తిన్నప్పుడు ఎంగిలి మింగినప్పుడు కూడా గొంతులో నొప్పిగా ఉండి మింగలేకపోతూ ఉంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు చాలా మంది తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఈ సమస్య మరింత తీవ్రమై గొంతులో ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు. అయితే ఎటువంటి ఆహారం అయినా మింగడం ద్వారానే అందరం తీసుకుంటాం.. మింగడంలో అనేది చాలా తేలికంగా కనిపించినా దాని వెనక సంక్లిష్టమైన ప్రక్రియ ఉంటుంది. నాడులు, కండరాలు, కవాటాలు, మెదడు ఇలా చాలా భాగాలు పని చేస్తే కానీ ఆహారాన్ని మింగడం జరగదు. మొదట ఆహారాన్ని నోట్లో పెట్టుకోగానే, అక్కడి నుండి మెదడుకు సమాచారం వెళ్తుంది.
ఆ తర్వాత మెదడు నుండి వచ్చిన సందేశాల ఆధారంగా నోరు కదలడం మొదలవుతుంది. నోట్లో ఆహారం పెట్టుకోగానే కొండ నాలుక నుండి స్వరపేటిక వరకు ఉండే భాగాన్ని నాలుక మూసేస్తుంది. నాలుకపై ఉన్న ఆహారం శ్వాస మార్గంలోకి వెళ్లకుండా ఎపిగ్లాటిస్ అనే మృదులాస్తి పొర శ్వాస నాళాన్ని మూసేస్తుంది. తర్వాత అన్నవాహిక పై స్ఫింక్టర్ తెరుచుకుంటుంది. ఈ ప్రక్రియ అంతా కొన్ని సెకన్లలో జరిగిపోతుంది. తర్వాత ఆహారంలో అన్నవాహిక నుండి గొట్టంలాంటి నిర్మాణం గుండా జీర్ణాశయంలోకి చేరుకుంటుంది. ఆహారం మింగడానికి ఇన్ని భాగాలు సరిగ్గా పని చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ ఒక్కదాంట్లో అయినా సమస్య ఏర్పడితే మింగడం కష్టంగా మారుతుంది.
దీనినే డిస్ ఫేజియా అని పిలుస్తారు. ఈ సమస్య ఎలా వస్తుంది అన్న విషయానికి వస్తే.. యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలు కడుపులోని పదార్థాలు తిరిగి అన్న వాహికలోకి ప్రవహించినప్పుడు కనిపిస్తాయి. గుండెల్లో మంట, కడుపు నొప్పి, బర్పింగ్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతులో చేదు రుచితో గుండెల్లో లేదా ఛాతిలో మంట సంభవిస్తుంది. కొందరికి అన్నవాహికలోని కణజాలం పలుచటి పొరలా ఏర్పడుతుంది. దీనిని ఈసోఫేగల్ వెబ్ అంటారు. ఇది అన్నవాహికలో ఎక్కడైనా రావొచ్చు. చాలా మందిలో పై భాగంలోనే ఏర్పడుతుంది. రక్తహీనత ఉన్నవారిలో ఇది ఎక్కువగా వస్తుంది.
అన్నవాహికలోని కండరాలు సరిగ్గా తెరచుకోకపోవడం వల్ల అకలేషియా కార్డియో సంభవిస్తుంది. అన్నవాహిక, జీర్ణాశయం కలిగే చోట ఉండే వలయం సరిగ్గా తెరచుకోకపోవడం వల్ల ఆహారం జీర్ణాశయంలోకి చేరుకోదు. అలాగే ఆహారం మింగడానికి తోడ్పడే కండరాలు, నాడులను దెబ్బతీసే ఎలాంటి సమస్యలైనా డిస్ ఫేజియాకు దారి తీస్తాయి. నాడీ సమస్యలు, పక్షవాతం, న్యూరాని డిసీజ్ వంటి వాటి వల్ల మింగడం కష్టంగా మారుతుంది. అన్నవాహిక లైనింగ్ లో ప్రాణాంతక కణితి ఏర్పడినప్పుడు అది క్యాన్సర్ కు దారితీయవచ్చు. ఇది ఆహారాన్ని మింగడానికి ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ కారణాల వల్ల కూడా మింగడంలో సమస్యలు రావొచ్చు. అటువంటి సమయంలో వెంటనే వైద్యున్ని సంప్రదించండం మంచిది.