Rare Heart Condition: పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ ను వేధిస్తున్న వ్యాధి వివరాలివీ..
పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరణించినట్లు ఇటీవల మీడియాలో వదంతులు వ్యాపించాయి.
- By Hashtag U Published Date - 06:40 PM, Mon - 13 June 22
పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరణించినట్లు ఇటీవల మీడియాలో వదంతులు వ్యాపించాయి. దీంతో స్పందించిన ఆయన కుటుంబ సభ్యులు ముషారఫ్ కు ఏమీ కాలేదని స్పష్టం చేశారు. ” అమిలోడోసిస్ ” (Amyloidosis) సమస్య తీవ్రతరం కావడంతో గడిచిన మూడు వారాలుగా దుబాయ్‌లోని అమెరికన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. రికవరీ అసాధ్యమైన దశలో ఆయన ఉన్నట్లు స్పష్టం చేశారు.ముషారఫ్ ను ఇంతలా ఇబ్బంది పెడుతున్న ” అమిలోడోసిస్ ” సమస్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అమిలోడోసిస్ అంటే..
అమిలోడోసిస్ అనేది ..కండరాల సంబంధిత వ్యాధి. క్షయ (టీబీ), రుమటైడ్ ఆర్థరైటిస్ వంటి వ్యాధులు కూడా అమిలోడోసిస్ వ్యాధికి దారితీసే ముప్పు ఉంటుంది. అమిలోడోసిస్ వల్ల ముషారఫ్ శరీరంలోని వివిధ భాగాల కణజాలాల్లో కొన్ని ప్రోటీన్లు పరిమితికి మించి పేరుకు పోతున్నాయి. దీనివల్ల ఆయా శరీర భాగాలు, అవయవాలు పనిచేయకుండాపోయే ముప్పు ఏర్పడింది. అమిలోడోసిస్ వల్ల దెబ్బతిని ఉండొచ్చనే అనుమానం ఉన్న కణజాలంపై కాంగో రెడ్ రంగు అద్దకాన్ని అద్ది.. మైక్రో స్కోప్ తో చూడటం ద్వారా గుర్తించవచ్చు.
అబ్డోమినల్ ఫ్యాట్ ప్యాడ్ బయోప్సి, లివర్ బయోప్సి, ఫ్రీ లైట్ చైన్ అసె, మాస్ స్పెక్ట్రో స్కోపి వంటి వివిధ నిర్ధారణ పరీక్షల ద్వారా కూడా అమిలోడోసిస్ ను గుర్తించవచ్చు.
3 రకాలు..
అమిలోడోసిస్ ప్రధానంగా 3 రకాలు. వీటిలో మొదటిది ” అమిలోడోసిస్ ఏఏ” రకం. క్షయ (టీబీ), రుమటైడ్ ఆర్థరైటిస్ వంటి వ్యాధులు కలిగిన వారికి “అమిలోడోసిస్ ఏఏ” రకం వ్యాధి ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇక రెండో రకం దానిపేరు “అమిలోడోసిస్ టీటీఆర్”. దీని బారిన పడిన వారికి పెద్దగా చికిత్సా మార్గాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. దీనిబారిన పడి కిడ్నీ, కాలేయం దెబ్బతిన్న పలువురికి .. కిడ్నీ మార్పిడి, కాలేయ మార్పిడి సర్జరీలు చేస్తుంటారు. ఇక మూడో రకం దాని పేరు “ఏఎల్ అమిలోడోసిస్”. దీని బారిన పడే వారిలో శరీర కణజాలం నిర్మాణంతో ముడిపడిన అమైలాయిడ్ అనే ప్రోటీన్ కు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. మల్టిపుల్ మైలోమ వ్యాధికి అందించే చికిత్సనే దీనికి కూడా అందిస్తుంటారు. దీని బారినపడే పలువురు రోగులకు ఎముక మజ్జ మార్పిడి సర్జరీ చేస్తుంటారు. “ఏఎల్ అమిలోడోసిస్” బారినపడే వారు తగిన చికిత్స పొందడం ద్వారా దీర్ఘకాలం జీవించవచ్చు.
ముషారఫ్ గురించి..
* ఢిల్లీలో జన్మించిన ముషారఫ్..
దేశ విభజనకు ముందు 1943 ఆగస్టు 11న ముషారఫ్ ఢిల్లీలో జన్మించారు.
* ప్రస్తుతం ఆయన వయస్సు 78 ఏళ్లు.
* ముషారఫ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
* 1999లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. సైన్యాధ్యక్షుడిగా పాక్ పాలనా పగ్గాలు చేపట్టారు. రెండేళ్ల తర్వాత ఎన్నికల్లో గెలిచి పాక్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.
* 1999లో కార్గిల్ యుద్ధానికి పర్వేజ్ ముషారఫ్ ప్రధాన కారకుడు.
* 2001 నుంచి 2008 వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా ముషారఫ్ పని చేశారు.
* 2008లో అభిశంసనను తప్పించుకొనేందుకు ముషారఫ్ తన పదవికి రాజీనామా చేశారు.
* పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో ముషారఫ్
ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
* 2016లో తన కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లిపోయారు. ఆరేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నారు.