Purple Tomato For Cancer: ఊదా టమాటాకు అమెరికా గ్రీన్ సిగ్నల్.. క్యాన్సర్ కు చెక్ పెట్టే ఈ టమాటాల విశేషాలివీ
ఊదా టమాటాకు అమెరికా ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది నుంచి ఈ పంటను అమెరికాలో పండించవచ్చని ఆ దేశ వ్యవసాయ శాఖ శనివారం ప్రకటించింది.
- By Hashtag U Published Date - 07:30 AM, Mon - 19 September 22

ఊదా టమాటాకు అమెరికా ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది నుంచి ఈ పంటను అమెరికాలో పండించవచ్చని ఆ దేశ వ్యవసాయ శాఖ శనివారం ప్రకటించింది. క్యాన్సర్ కు చెక్ పెట్టే ఔషధ గుణాలు కలిగిన ఈ వెరైటీ టమాటా పై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో వాటికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం.
ఎలా తయారు చేశారు?
2008లో యూరోపియన్ పరిశోధకులు డ్రాగన్ పుష్పాలు, డ్రాగన్ పూలు, డాగ్ పూల జీన్స్ ను టమాటాలోకి ప్రవేశపెట్టి ఊదా టమాటాలు సృష్టించారు. అయితే వీటికి ఎలాంటి రుచి, వాసన ఉండదు.వీటిలో క్యాన్సర్ వ్యాధిని, హృద్రోగాలను నిరోధించే ఆంతోసయానిన్ అనే పదార్థం, ఇతరత్రా బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఈ టమాటాలు చూడగానే నల్ల వంకాయల్లా కనిపిస్తాయి. వీటిని అభివృద్ధి చేసిన సైంటిస్టుల టీమ్ లో ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్ పరిశోధకులు ఉన్నారు.
ఈ జన్యుమార్పిడి పంటను తమ దేశంలో పండించేందుకు తొలి సారి అమెరికా వ్యవసాయ శాఖ ఒప్పుకోలేదు.14 ఏండ్ల తర్వాత ఎట్టకేలకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఎలుకలపై ప్రయోగాలు..
అధ్యయనంలో భాగంగా క్యాన్సర్ సోకిన ఎలుకలకు ఊదా టొమాటోలు ఇచ్చారు. దీంతో వాటి లైఫ్ టైం గణనీయంగా పెరిగింది. సాధారణ టొమాటోలు తిన్న క్యాన్సర్ బాధిత ఎలుకల కంటే.. ఊదా టొమాటోలు తిన్న క్యాన్సర్ బాధిత ఎలుకల ఆయుష్షు పెరిగింది. బ్రిటన్ కు చెందిన Norfolk Plant Sciences అనే కంపెనీ ఊదా టొమాటోల విత్తనాల అభివృద్ధి కి సంబంధించిన దరఖాస్తును 2021 ఆగస్టులో సమర్పించింది. వాస్తవానికి 2009 నుంచే ఆ కంపెనీలో ఊదా టొమాటోలపై రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వర్క్ జరుగుతోంది. ఇంకా ఊదా టొమాటోలకు బ్రిటన్ లో అనుమతి రాలేదు. కానీ అమెరికా పచ్చజెండా ఊపేసింది. వచ్చే ఏడాది నుంచి అమెరికా సూపర్ మార్కెట్ షెల్ఫ్ లలో ఊదా టొమాటో కూడా కనిపించనుంది.