Nasal Vaccine : నాసల్ వ్యాక్సిన్ ఎవరికి.. ఎలా వేస్తారు ?
ముక్కు ద్వారా వేసే సరికొత్త కొవిడ్ వ్యాక్సిన్ (Nasal Covid Vaccine) ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ గురువారం రోజున రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేశారు.
- By Hashtag U Published Date - 11:42 AM, Fri - 27 January 23

ముక్కు ద్వారా వేసే సరికొత్త కొవిడ్ వ్యాక్సిన్ (Nasal Covid Vaccine) ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ గురువారం రోజున రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేశారు. మన హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ (Bharat BioTech) కంపెనీ “iNCOVACC” నాసల్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ప్రైవేటు మార్కెట్లో దీన్ని రూ.800కు విక్రయించనున్నారు. 18 ఏళ్లకు పైబడిన వారందరూ ఈ నాసల్ వ్యాక్సిన్ ను బూస్టర్ డోసుగా తీసుకోవచ్చు. అయితే ఇప్పటికే బూస్టర్ (మూడో) డోసు తీసుకున్న వారికి ఇది వేయరు. నాలుగో డోసు ఇచ్చేలా వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ కు సంబంధించిన కొవిన్ పోర్టల్ లో కూడా సెట్టింగులు లేవు. అందులో ఒక్కో వ్యక్తికి మూడు డోసులు వేసేందుకు అనువుగా మాత్రమే సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక ఇంతకుముందు రెండు డోసులు ఏ కంపెనీ కొవిడ్ వ్యాక్సిన్ (Covid Vaccine) తీసుకున్న వారైనా .. నాసల్ వ్యాక్సిన్ ను బూస్టర్ గా తీసుకునేందుకు అర్హులే. నాసల్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న 28 రోజులకు రెండో డోసు వేస్తారు. ఒక్కో డోసులో ఒక్కో ముక్కు రంధ్రంలో చెరో నాలుగు వ్యాక్సిన్ డ్రాప్స్ వేస్తారు.
వైద్య నిపుణుల మాట ఇదీ..
“నాసల్ వ్యాక్సిన్‌ను మొదటి బూస్టర్ డోస్‌గా రికమెండ్ చేస్తున్నాం. ఇప్పటికే ప్రికాషనరీ/బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్లు కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్లు నాసల్ వ్యాక్సిన్ తీసుకోనక్కర్లేదు. ప్రికాషన్/బూస్టర్ డోస్ తీసుకోని వాళ్లకు మాత్రం నాసల్ వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది” అని ఓ వైద్య నిపుణుడు వెల్లడించారు.
నాసల్ వ్యాక్సిన్ పనితీరు..
సాధారణంగా వ్యాక్సిన్ అనగానే మనకు సిరంజీ గుర్తుకొస్తుంది. వయల్ నుంచి మందు తీసి నీడిల్‌తో మనకు ఎక్కిస్తారు. కానీ నాసల్ వ్యాక్సిన్ తీరు వేరు. అది నేరుగా ముక్కులో చుక్కల ద్వారా అందిస్తారు. కరోనా వైరస్ ముక్కులో నివసిస్తున్నందున ఈవిధంగా వ్యాక్సిన్ ను తయారు చేశారు. ఈ చుక్కలను ముక్కు ద్వారా అందిచడం వల్ల వైరస్‌పై చాలా సమర్థంగా పని చేసి.. ఊపిరితిత్తుల్లోకి కరోనా వైరస్ వెళ్లకుండా అడ్డుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. మూడు సార్లు ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాక.. ఈ నాసల్ వ్యాక్సిన్‌కు భారత ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. మూడు క్లినికల్ ట్రయల్స్‌లోనూ ఈ టీకా చాలా సమర్థంగా పని చేసినట్టు వెల్లడైంది.