Titanium Heart : టైటానియం గుండె వచ్చేసింది.. 105 రోజులుగా బతుకుతున్న హృద్రోగి
ఆస్ట్రేలియాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి కొన్ని నెలల క్రితం టైటానియం గుండెను(Titanium Heart) అమర్చారు.
- By Pasha Published Date - 08:27 AM, Tue - 18 March 25

Titanium Heart : ‘‘ఇనుములో హృదయం మొలిచెలె’’ అనే సాంగ్ రజనీకాంత్ రోబో మూవీలో ఉంది. వాస్తవానికి ఇనుములో కాదు.. టైటానియంలో హృదయం మొలిచింది. అవును.. టైటానియంతో కృత్రిమ గుండెను తయారు చేశారు. దీనికి బైవకోర్(BiVACOR) అని పేరు పెట్టారు. ఇది కూడా పిడికెడు సైజులోనే ఉంటుంది. ఆస్ట్రేలియాకు చెందిన డేనియల్ టిమ్స్ ఈ టైటానియం గుండెను తయారు చేశారు. ఈ గుండెల తయారీ కోసం ఆయన బైవకోర్ పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. దానికి అమెరికాలోని కాలిఫోర్నియా, ఆస్ట్రేలియాలోని సౌత్ పోర్ట్‌లలో ఆఫీసులు ఉన్నాయి. డేనియల్ టిమ్స్ తండ్రి ఒక ప్లంబర్. 2001లో టిమ్స్ తండ్రికి గుండె సమస్యలు వచ్చాయి. అప్పటి నుంచే డేనియల్ టిమ్స్ టైటానియం గుండె తయారీపై ఫోకస్ పెట్టారు. తన తండ్రి హార్డ్‌వేర్ స్టోర్‌లోకి వెళ్లి పైపులను, వాల్వ్‌లను జత చేయటంతోనే ఈ పనిని మొదలుపెట్టారు. గుండె రక్త ప్రసరణ వ్యవస్థను అనుకరిస్తూ ఎన్నో డిజైన్లు, ప్రయోగాలు చేశారు. చివరికి ప్రపంచంలోనే తొలి టైటానియం గుండె నమూనాను ఆవిష్కరించారు. దీనితో జంతువులపై ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. దీంతో మనుషులపై టెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ గుండె ప్రయోగశాలలో గత నాలుగేళ్లుగా పనిచేస్తూనే ఉండటం విశేషం.
40 ఏళ్ల వ్యక్తి.. 105 రోజులు
ఆస్ట్రేలియాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి కొన్ని నెలల క్రితం టైటానియం గుండెను(Titanium Heart) అమర్చారు. దీనితోనే ఆయన గత 105 రోజులుగా జీవిస్తున్నారు. కృత్రిమ గుండెతో ఆస్పత్రి బయట నెలకుపైగా బతికి తొలి వ్యక్తిగా ఈయన రికార్డును క్రియేట్ చేశారు. ఇప్పటివరకు టైటానియం గుండెను ప్రయోగాత్మకంగా ప్రపంచంలో ఆరుగురికి అమర్చారు. దీన్ని అమర్చుకున్న మరో ఐదుగురు ఆస్పత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో గడిపారు. ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి మాత్రం టైటానియం గుండెను అమర్చుకున్నాక ఇంటికి వెళ్లిపోయాడు. తన రోజువారీ పనులను హాయిగా చేసుకుంటున్నాడు. ఇటీవలే ఆయనకు ఒక దాత దొరికాడు. దీంతో ఆ దాత అసలు గుండెను తీసి.. ఆయనకు అమర్చారు. లోహపు గుండెను తీసేశారు. టైటానియం గుండెను అమర్చబట్టే.. గుండెను దానం చేసే వ్యక్తి దొరికే వరకు ఆయన బతికారని అంటున్నారు.
Also Read :Nagpur Violence: నాగ్‌పూర్‌లో అల్లర్లు.. అమల్లోకి 144 సెక్షన్.. కారణం అదే ?
టైటానియం గుండె గురించి..
- టైటానియం గుండె బైవకోర్ విరిగిపోదు. ఇది స్ట్రాంగ్‌గా ఉంటుంది.
- ఈ గుండెలోని భాగాలేవీ కదలవు. అయస్కాంత ప్రభావంతో తేలే రోటర్ ఒక్కటే కదులుతుంది.
- టైటానియం గుండెలోని తేలే రోటర్ ఇతర కఠిన ఉపరితలాలను తాకకుండా, రెండు గదుల మధ్య తిరుగుతూ నిరంతరం, తేలికగా రక్తాన్ని పంప్ చేస్తుంది.
- ఈ గుండె ఎక్కువ కాలం మన్నుతుంది.
- ఈ గుండెను వాడే క్రమంలో.. కడుపు భాగంలో అమర్చే బ్యాటరీని మాత్రమే మార్చాలి.
- టైటానియం గుండె బరువు 650 గ్రాములు. 12 ఏళ్ల పిల్లల ఛాతీలోనూ ఇది ఇమిడిపోతుంది.
- ఈ గుండెలో స్మార్ట్ కంట్రోలర్ ఉంటుంది. ఇది రోగుల పనులు, శ్రమకు అనుగుణంగా రక్త సరఫరాను కంట్రోల్ చేస్తుంది.
- టైటానియం గుండెను ఇంకా మార్కెట్లో విక్రయాల కోసం అందుబాటులోకి తేలేదు.
- ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 వేల మందికి గుండె మార్పిడి సర్జరీలు అవసరం. అయితే 6వేల కన్నా తక్కువ మందే గుండె మార్పిడి సర్జరీలు చేసుకుంటున్నారు.
- తీవ్రంగా గుండె దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి టైటానియం గుండె బాగా పనికొస్తుంది.