Deepavali: దీపావళి రోజు పిండి దీపాలను వెలిగించడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే!
దీపావళి రోజు పిండి దీపాలను వెలిగించడం వల్ల మంచి లాభాలు కలుగుతాయని చెబుతున్నారు..
- By Anshu Published Date - 03:46 PM, Tue - 29 October 24

దీపావళి పండుగ రోజు దీపాలు వెలిగిస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొందరు కొవ్వొత్తులు వెలిగిస్తే మరి కొందరు మట్టి ప్రమిదలను వెలిగిస్తూ ఉంటారు. ఇంకొంతమంది పిండితో దీపాలను చేసి వెలిగిస్తూ ఉంటారు. కాగా అమావాస్య తిథి తర్వాత రోజును చోటీ దీపావళి అంటారు. ఈ రోజున పిండి దీపాన్ని వెలిగించడం శుభప్రదంగా, పవిత్రంగా భావిస్తారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఈ చోటీ దీపావళి నాడు యముడిని పూజిస్తారు. యముడికి పిండి దీపాన్ని వెలిగిస్తే నరకానికి వెళ్లరని నమ్ముతారు.
అంతేకాదు పిండి దీపాన్ని వెలిగిస్తే యమదేవుడి కన్ను మన కుటుంబంపై ఉండదని అంటారు. అందుకే చాలా మంది తమ ఇళ్లల్లో పిండి దీపాన్ని వెలిగిస్తారు. అయితే ఈ దీపాన్ని వెలిగించి మీ ఇంట్లోని ప్రతి మూలా తిప్పాలట. ఆ తర్వాత ఆ దీపాన్ని దక్షిణ దిశలో పెట్టాలి. ఎందుకంటే ఈ దిక్కునే యమదేవుడు ఉండాటని భావిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల అంతా మంచే జరుగుతుంది అని అంటున్నారు పండితులు.
అలాగే దీపావళి పండుగ రోజున 13 దీపాలను వెలిగిస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఒక్కొక్క దీపాన్ని ఒక్కొక్క ప్రదేశంలో పెడతారు. కేవలం దీపాలను వెలిగించడం మాత్రమే కాకుండా లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవని, అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే దీపావళికి లక్ష్మీదేవిని పూజించే వారు తప్పకుండా విఘ్నేశ్వరుడిని కూడా పూజించాలట. మొదటి విఘ్నేశ్వరుని పూజించిన తర్వాతే లక్ష్మీ పూజ చేయాలని చెబుతున్నారు.