Deepa Danam: కార్తీకమాసంలో దీపదానం ఎలా చేయాలి?
కార్తీక మాసంలో దీప దానం చేసే ముందు కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:00 AM, Thu - 7 November 24

మామూలుగా దీపదానం ఏ నెలలో అయినా చేయవచ్చు కానీ కార్తీక మాసంలో చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయట. చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉన్నరోజు పౌర్ణమి కావడంతో ఈ నెలకు కార్తీకమాసం అనే పేరు వచ్చింది. కృత్తిక అగ్ని సంబంధిత నక్షత్రం అందుకే ఈ మాసంలో దీపదానం అత్యుత్తమం అని చెబుతున్నారు. ఈ కార్తీకమాసం మొత్తం ఇంట్లో తులసి మొక్క వద్ద దేవాలయాల దగ్గర దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే దీపాలు వెలిగించడమే కాదు, దీపదానం చేయడం వల్ల కూడా పుణ్యఫలం దక్కుతుందట.
ఈ దానం ఎలా చేయాలంటే.. బియ్యంపిండి లేదా గోధుమ పిండిని ఆవుపాలతో కలిపి ప్రమిదను తయారు చేయాలి. అందులో దీపం వెలిగించి దానం ఇవ్వాలి. బియ్యం పిండితో దీపం చేయనివారు మట్టి ప్రమిదలో దీపాన్ని, స్వయంపాకం, కొంత దక్షిణగా పెట్టి దీపాన్ని దానం ఇవ్వవచ్చు. అయితే దానం ఇచ్చే ముందు పసుపు, కుంకుమ,పూలతో దీపాన్ని అందంగా అలంకరించి ఇవ్వాలి. సంధ్యా సమయంలో దీపదానం చేస్తే మంచిదట. ఇచ్చే స్తోమత ఉన్నవారు వెండి ప్రమిదలో బంగారు వత్తిని వేసి దీపదానం చేయవచ్చట.
కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకూ ఉండే ఐదు రోజుల్లో దీపదానం అత్యుత్తమం అంటున్నారు. దీపదానం చేసే ముందు ఈ శ్లోకాన్ని చెబుతూ దీపదానం చేయాలట. “సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంప త్సుఖావహం,, దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ”.