Karthika Pournami : కార్తీక పౌర్ణమి విశిష్టత.. తులసికోటలో రాధాకృష్ణుల పూజ.. ఫలితం ఏంటి ?
కార్తీక మాసాన్ని సకల శుభప్రదంగా భావిస్తారు. కార్తీకమాసమంతా స్నాన, దాన, జప, ఉపావాసాలు చేయలేనివారు.. ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులోనైనా ఆచరించాలని..
- By News Desk Published Date - 05:30 AM, Sun - 26 November 23

Karthika Pournami : తెలుగు నెలల్లో ప్రతి మాసంలోనూ పూజలు చేస్తారు కానీ.. ఏ మాసం పేరుతోనూ దీపం దానం ఉండదు. ఒక్క కార్తీకమాసంలో వెలిగించే దీపాలకు మాత్రం చాలా విశిష్టత ఉంటుంది. కార్తీక దీపాలు వెలిగించారు అంటారు కానీ.. ఆశ్వీయుజ దీపం, మృగశిర దీపాలని ఎక్కడా చెప్పలేదు. ప్రత్యేకంగా ఈ నెలంతా శివుడిని అధికంగా పూజిస్తారు. ఆ శివయ్యకు ఒక్క బిల్వపత్రాన్ని సమర్పించి ఏం కోరినా తీరుస్తాడని భక్తుల నమ్మకం. కార్తీక మాసమంతా పూర్తి నిష్టతో శివయ్యను ఆరాధిస్తారు. ఈ మాసమంతా మాంసం ముట్టకుండా, ఉల్లు, వెల్లుల్లి, ఇతర మసాలాలతో చేసిన ఆహారాన్ని తినకుండా సాత్విక ఆహారాన్ని మాత్రం తీసుకుంటారు.
కార్తీక మాసాన్ని సకల శుభప్రదంగా భావిస్తారు. కార్తీకమాసమంతా స్నాన, దాన, జప, ఉపావాసాలు చేయలేనివారు.. ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులోనైనా ఆచరించాలని, అదికూడా కుదరని వారు కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో ఒక్క దీపం వెలిగించినా పౌండరీకయజ్ఞం చేసినంత ఫలితం లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు. ప్రతి మాసంలో ఒక పౌర్ణమి వస్తుంది కానీ.. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసివచ్చే కార్తీక పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత మరే పౌర్ణమికి ఉండదనడంలో సందేహం లేదు. కార్తీక పూర్ణిమ నాడు చంద్రుడిలో కనిపించే ఆ తేజస్సు.. మరే పున్నమికీ కనిపించదు. పిండి ఆరబోసినట్లుగా ఉండే వెన్నెలలో దేశంలో ఉండే దేవాలయాల ఆవరణలు, జలాశయాలు కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతుంటాయి.
కార్తీక పున్నమినాడు వేకువజామునే లేచి.. శివనామస్మరణ చేస్తూ.. వీలును బట్టి నదీ లేదా తటాక స్నానం.. ఏవీ కుదరకపోతే ఇంటిలోనే తలస్నానం చేస్తారు. తెల్లవారకముందే దీపారాధన చేసి అరటిడొప్పల్లో పెట్టి చెరువులు, నదులలో వదిలి, రాత్రికి తులసికోటలో ఉసిరికొమ్మ, ఉసిరికాయలను పెట్టి రాధాకృష్ణుల విగ్రహాన్ని పూజిస్తారు. ఇలా చేస్తే కన్యలకు మంచి భర్త లభిస్తాడని, వివాహితల సౌభాగ్యం పదికాలాల పాటు నిలుస్తుందని పెద్దలు చెబుతారు.
అలాగే.. ఈ రోజున నమకచమక మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడవుతాడని పురాణాలు చెబుతున్నాయి. ఇదేరోజున ఉసిరికాయ దానం చేస్తే దారిద్య్రం తొలగిపోతుందని నమ్మకం. లలితా సహస్రనామాన్ని భక్తితో పఠిస్తే .. ఆ తల్లి సకల ఐశ్వర్యాలనూ అందిస్తుందట. కార్తీక పౌర్ణమిని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అనీ పిలుస్తారు. విష్ణుమూర్తి మత్స్యావతారంలో అవతరించిందీ, వృందాదేవి తులసిమొక్కగా ఆవిర్భవించిందీ, కార్తికేయుడు, దత్తాత్రేయులు జన్మించిందీ కార్తీక పౌర్ణమి రోజునే.