Navratri: నవరాత్రి సమయంలో అఖండ దీపం వెలిగిస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
అఖండ దీపం వెలిగించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు.
- By Anshu Published Date - 03:55 PM, Fri - 27 September 24

మరికొద్ది రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాలలో దసరా నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా వేగంగా జరుగుతున్నాయి. వచ్చేనెల అనగా అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఈ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కొంతమంది ఇళ్లలో నవరాత్రుల సమయంలో కేవలం దీపారాధన చేసుకుంటే మరి కొందరు అఖండ దీపం వెలిగిస్తూ ఉంటారు. అయితే అఖండ దీపం వెలిగించడం మంచిదే కానీ, ఇలాగ అఖండ దీపం వెలిగించే సమయంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అఖండ దీపాన్ని ఇత్తడి లేదా మట్టి దీపంలో మాత్రమే వెలిగించాలి. ఆ దీపం తొమ్మిది రోజులపాటు కొండెక్కకుండా చూసుకోవాలి. దీపం వెలిగించిన తర్వాత నేలపై ఉంచకూడదు. ప్లేట్లో అక్షింతలు వేసి దానిపై దీపాన్ని పెట్టాలి. దీపం 9 రోజులు పాటు ఆరిపోకుండా వెలుగుతూనే ఉండాలి. దీపాన్ని వెలిగించడానికి ఒత్తిగా కాటన్ బట్టని ఉపయోగించడం మంచిది. దీపానికి గాలి తగలకుండా, ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దీపంలో నెయ్యి లేదా నువ్వుల నూనె వేస్తూ ఉండాలి. దీపంలో నెయ్యి లేదా నూనె వేసిన తరువాతే నిద్రించాలి. దీపాన్ని తరచుగా మార్చకూడదు. అలాగే ఈ తొమ్మిది రోజులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి, సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు.
తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత అఖండ దీపాన్ని మీరు స్వయంగా ఆర్పవద్దు. అది దానంతట అదే ఆరిపోవాలి. దీపాన్ని స్వయంగా ఆర్పడం అశుభం. అఖండ దీపాన్ని ఇంట్లో వెలిగించడం వల్ల ఇంట్లో సానుకూలత వ్యాప్తిస్తోంది. ప్రతికూల శక్తి నుండి ఇంటిని రక్షిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. జీవితంలో కోరికలను నెరవేర్చటంలో, ప్రేమ, ఆరోగ్య సమృద్ధి వంటి విషయాలలో సానుకూల దృక్పథం చూపిస్తుంది. అఖండ జ్యోతిని వెలిగించేటప్పుడు ఈ మంత్రాన్ని 11 సార్లు జపించాలి.
శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద| శత్రు బుద్ధి వినాశాయ దీపకాయ నమోస్తుతే|| దీపో జ్యోతి పరం బ్రహ్మ దీపో జ్యోతిర్జనార్ధనః | దీపో హరతు మే పాపం సంధ్యా దీప నమోస్తుతే || ఈ మంత్రాన్ని జపిస్తూ దీపం వెలిగించడం వల్ల అమ్మవారి కరుణాకటాక్షాలు లభిస్తాయి.