Karwa Chaut: కర్వా చౌత్ ఎప్పుడు ? పూజా సమయం.. పూజా విధానమేంటి ? లాభాలు ఏమిటి ?
"కర్వా చౌత్".. ఒక స్పెషల్ పండుగ.
- By Hashtag U Published Date - 06:30 AM, Mon - 3 October 22

“కర్వా చౌత్”.. ఒక స్పెషల్ పండుగ.
దీన్ని ఏటా దీపావళికి పది రోజులు ముందు వచ్చే పండగ. ఉత్తరాది ప్రజలు “కర్వా చౌత్” ను ఎంతో వేడుకగా జరుపుకొంటారు. ఈ ఫెస్టివల్ ను యుగయుగాలుగా జరుపుతున్నారు.పాండవుల శ్రేయస్సు, దీర్ఘాయువు కోసం ద్రౌపతి కర్వా చౌత్ ఉపవాసం పాటించారని అంటారు. పార్వతి శివుని కోసం ఇదే ఉపవాసం పాటించారని చెబుతారు. ఇవే కాకుండా ఈ పండుగ ఎలా ప్రారంభమైందనే దానిపై వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి. ఉత్తర భారతదేశంలోని పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ మరియు కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ మొదలైన రాష్ట్రాల్లో ఈ ఉపవాసాన్ని ఆచరిస్తారు.
“కర్వా చౌత్” రోజున..
కర్వా చౌత్ పండుగను కార్తీక మాసంలోని కృష్ణపక్షం 4వ రోజున జరుపుతారు. ఆధునిక క్యాలెండర్ ప్రకారం ఇది సాధారణంగా అక్టోబర్/నవంబర్ నెలలో వస్తుంది.
ఆ రోజున వివాహిత స్త్రీలు తమ భర్తల క్షేమం, దీర్ఘాయువు కోసం ఉపవాసం ఆచరిస్తారు. రోజంతా వ్రతం ఆచరించి.. సాయంత్రం గిన్నెలో నీళ్లు తీసుకుంటారు. ఓ పళ్లెంలో గోధుమలు నింపి పార్వతీ దేవి పూజ చేస్తారు. దాంతోపాటు వ్రతం కధ వింటారు. ఆ తరువాత రాత్రి చంద్రోదయం తరువాత వ్రతం వదులుతారు. ఉదయం నుంచి ఉపవాసముండి, సాయంత్రం చంద్రుడికి పూజ చేసి.. ఆకాశంలో చందమామ రాగానే ఒక జల్లెడ చాటున భర్తను చూడటం ఈ పండుగలో విశేషం. ఈ విధంగా చేయడం వల్ల తమ భర్త క్షేమంగా ఉంటాడని భర్య విశ్వాసం. జల్లెడ చాటున భర్తను చూసి ఆ తర్వాత తన ఉపవాస దీక్షను విరమిస్తుంది భార్య.ఆరోగ్యవంతులైన మహిళలు ఈ వ్రతం రోజున నీళ్ళు కూడా ముట్టరు. అయితే గర్భిణీ మహిళలు లేదా ఆరోగ్య సంబంధ సమస్యలున్నవారు మాత్రం వ్రతం సందర్భంగా పండ్లు తినవచ్చు. ఇక పెళ్లికాని అమ్మాయిలైతే తమకు మంచి భర్త రావాలని పూజలు చేస్తారు.
ఈసారి కర్వా చౌత్ ఎప్పుడు ?
ఈసారి కర్వా చౌత్ వ్రతం అక్టోబర్ 13 వతేదీన ఉంది. పూజకు అనువైన శుభ ముహూర్తం కూడా ఇదే రోజు. కార్తీక మాసం చతుర్ధి తిధి అక్టోబర్ 13న 1 గంట 59 నిమిషాలకు ప్రారంభమై…అక్టోబర్ 14వ తేదీ ఉదయం 3 గంటల 8 నిమిషాల వరకూ ఉంటుంది. ఉదయ తిధి లెక్కల ప్రకారం అక్టోబర్ 13న జరుపుకుంటారు.
కర్వా చౌత్ నాడు పూజ కోసం అక్టోబర్ 13 వ తేదీ 5 గంటల 54 నిమిషాల నుంచి 7 గంటల 9 నిమిషాల వరకూ శుభ ముహూర్తంగా ఉంది. కర్వా చౌత్ నాడు చంద్రోదయ సమయం రాత్రి 8 గంటల 9 నిమిషాలకుంది.