Karthika Masam: కార్తీకమాసంలో ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారు.. దీని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో మీకు తెలుసా?
Karthika Masam: కార్తీకమాసంలో ఉసిరి దీపాలను ఎందుకు వెలిగిస్తారు. ఇలా వెలిగించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 AM, Wed - 29 October 25
Karthika Masam: కార్తీకమాసం వచ్చింది అంటే చాలు ఇల్లు దేవాలయాలు కార్తీకదీపాలతో వెలిగిపోతూ ఉంటాయి. కాగా పవిత్ర మాసాలలో కార్తీకమాసం కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఈ మాసంలో చేసేటటువంటి పూజలు పరిహారాలు ప్రత్యేక ఫలితాలను అందిస్తాయి. శివ కేశవులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో దీపారాధన చేయడం వల్ల సకల దేవతల అనుగ్రహాలు పొందవచ్చని అంటారు.
అందుకే కార్తీక మాసం మొత్తంలో ప్రతిరోజు దీపాలు వెలిగిస్తుంటారు. ఆలయాల్లోనూ కొన్ని ప్రత్యేక రోజుల్లో దీపాలు వెలిగించి దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. కార్తీక మాసంలో వచ్చే సోమవారం ఎంతో పవిత్రమైనదని భావిస్తారు. ఈరోజు శివుడిని దర్శించుకోవడం వల్ల ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే దశమి, ఏకాదశి రోజున శివుడి దర్శనం చేసుకుంటే అనుకున్న పనులు జరుగుతాయని నమ్మకం. ఈ మాసంలో సాధారణ దీపం కాకుండా ఉసిరి దీపాలు వెలిగిస్తే విజయాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఉసిరి చెట్టును ఈశ్వరుడి స్వరూపంగా భావిస్తారు.
ఉసిరి చెట్టులో సకల దేవతలు నివసిస్తారని ఉసిరి చెట్టు కింద భోజనం చేసిన సకల ఆరోగ్యాలు ఉంటాయని భావిస్తారు. ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోతాయని కొందరు పండితులు చెబుతున్నారు. కాగా ఉసిరి చెట్టు కింద ఉసిరికాయతో దీపం వెలిగించడం వల్ల ఎన్నో దోషాల నుంచి బయటపడవచ్చు అని పండితులు చెబుతున్నారు. అలాగే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి, శ్రీమహా విష్ణువు అనుగ్రహం లభిస్తుందట. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగించడం వల్ల నరదృష్టి తొలగిపోతుందని చెబుతున్నారు. అలాగే ఈ మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆ స్వామివారి అనుగ్రహం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.