Karthika Masam 2024: కార్తీకదీపం నీటిలో వదలడం వెనుక ఉన్న కారణం ఇదే!
కార్తీకమాసంలో దీపాలను వెలిగించి నీటిలో వదలడం వెనుక ఉన్న ఆంతర్యం గురించి తెలిపారు.
- By Anshu Published Date - 12:35 PM, Mon - 11 November 24

తెలుగు మాసాలలో కార్తీకమాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో చేసేటటువంటి పూజలు ప్రత్యేక ఫలితాలను అందిస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆర్థిక సమస్యల నుంచి బయటపడటంతో పాటు ఇంకా అనేక రకాల సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ఈ కార్తీకమాసం నెల రోజులు భక్తిలో మునిగితేలుతుంటారు. కార్తీకం నెల మొత్తం ఇంట్లో కన్నా చెరువులు, నదుల్లో దీపాలు విడిచి పెడతారు. సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం ఆచరించి ఒడ్డున ముగ్గు వేసి దీపం వెలిగించి కార్తీక దామోదరుడికి నమస్కరిస్తారు.
సూర్యోదయం అయ్యే సమయానికి మిణుకు మిణుకు మంటూ నీటిపై తేలియాడుతూ కనిపిస్తాయి దీపాలు. అయితే చాలామంది కార్తీక దీపాలను నీటిలో వదులుతూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారు అన్న విషయం చాలా మందికి తెలియదు. మరి ఆ వివరాల్లోకి వెళితే.. పంచాక్షరి పంచభూతాలే సకల ప్రాణికోటికీ జీవనాధారాలు. శివ అంటే శుభం, క్షేమం, శ్రేయం, మంగళం అనే అర్థాలు ఉన్నాయి. ఈ జగత్తు మొత్తం శివమయం అయినప్పుడు అంతటా నిండి ఉండేది శివుడే కదా. పంచ భూతాలను తనలో లయం చేసుకుని లయకారుడు అయ్యాడు శివుడు. తాను పంచభూతాత్మకం అని చాటి చెప్పేందుకే పంచ భూత లింగాలుగా వెలసి పూజలందుకుంటున్నాడు.
దీపాలు నీటిలో ఎందుకు విడిచిపెడతారో తెలియాలంటే శివం పంచభూతాత్మకం అని అర్థం కావాలి. మరణానంతరం మనిషి శరీరంలో ఉండే ఆత్మ జ్యోతి స్వరూపంగా మారి భగవంతుడిని చేరుతుంది. పంచభూతాల్లో ఒకటైన జ్యోతి స్వరూపంలో ఉండే ఆత్మని పంచభూతాల్లో మరొకటైన నీటిలో వదలుతున్నాం. అంటే మనిషిలో అగ్ని రూపంలో ఉండే ఆత్మ జ్యోతిని పంచ భూతాత్మకం అయిన పరమేశ్వరుడికి అంకితం చేస్తున్నారని అర్థం. జ్యోతిని నిత్యం నదుల్లో వదలొచ్చు కదా అనే సందేహం కలగవచ్చు. కేవలం కార్తీకమాసంలోనే ఎందుకు అనే సందేహం వచ్చి ఉండొచ్చు.
మొత్తం 12 నెలల్లో కార్తీకం శివయ్యకు అత్యంత ప్రీతికరం. ఈ సమయంలో బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి పుణ్యస్నానం ఆచరించి జ్యోతి వెలిగించి నీటిలో విడిచిపెడితే మరణానంతరం శివుడి సన్నిధికి చేరుకుంటామని పండితులు చెబుతారు. ఈ నెల రోజులు అనుసరించే స్నానం, దీపం, దానం, ఉపవాసం ఎన్నో రెట్లు పుణ్య ఫలాన్ని అందిస్తాయని అంటారు. శివ కేశవులకు ప్రీతకరమైన కార్తీకంలో శివయ్యను బిల్వ దళాలు, జిల్లేడు పూలతో శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో అర్చిస్తే మరో జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.