Spiritual: ఇంట్లో ఎవరైనా చనిపోతే దీపారాధన చేయకూడదా.. ఆలయాలకు వెళ్ళకూడదా.. పండితులు ఏం చెబుతున్నారంటే?
ఇంట్లో ఎవరైనా చనిపోతే సంవత్సరం పాటు దీపారాధన చేయకూడదు. ఆలయాలకు వెళ్ళకూడదు అన్న విషయాల గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 12:34 PM, Fri - 21 February 25

మామూలుగా ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు మూడు రోజులు, ఐదు రోజులు లేదంటే 11 రోజుల దినాలు చేస్తూ ఉంటారు. ఆ తరువాత దాదాపు ఏడాది వరకు ఇంట్లో ఎలాంటి పూజలు నిర్వహించరు. అంతేకాకుండా కనీసం దీపారాధన కూడా చేయరు. దేవాలయాలకు కూడా వెళ్లరు. ఇంట్లో ఉండేటటువంటి పూజా సామాగ్రి దేవుడి ఫోటోలు విగ్రహాలు అన్నీ కూడా ఒక వస్త్రంలో చుట్టి పక్కన పెట్టేస్తూ ఉంటారు. సంవత్సరం పూర్తి అయిన తర్వాత వాటిని దింపి శుభ్రం చేసి ఆ తర్వాత పూజ మొదలు పెడుతూ ఉంటారు. కొందరు ఈ విధంగా మూడు నెలల పాటు చేస్తూ ఉంటారు. అయితే నిజంగానే ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది పాటు పూజలు చేయకూడదా? దేవాలయాలకు కూడా వెళ్లకూడదా? ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
హిందూ సంప్రదాయంలో దీపారాధనకు ప్రత్యేక స్థానం ఉంది. దీపం అనేది శుభానికి సంకేతం. దీపం వెలిగించిన చోట, మనం నిత్యం పూజించే పటాల్లో, విగ్రహాల్లో దేవతలు నివసిస్తుంటారని చెబుతున్నారు. ఏడాది పాటు వాటన్నింటినీ పక్కన పెట్టేయడం అనేది దోషం కిందకే వస్తుందట. కాబట్టి, ఒక వ్యక్తి మరణించిన తరువాత కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యాక యథావిధిగా దీపారాధన చేయవచ్చని చెబుతున్నారు. అప్పటివరకు చేసినటువంటి పూజా కార్యక్రమాలన్నింటిని తిరిగి నిరభ్యంతరంగా ప్రారంభించచ్చట.
దేవాలయాలకు వెళ్లవచ్చా? అన్న విషయానికి వస్తే.. తల్లి లేదా తండ్రి ఎవరైనా మరణిస్తే సంవత్సరంపాటు దేవాలయాలకు వెళ్లకుండా ఉంటారు. అయితే ఈ సమయంలో మీకు రోజూ దేవాలయానికి వెళ్లే అలవాటు ఉంటే ఏ సంకోచం లేకుండా వెళ్లవచ్చట. తీర్థం కూడా తీసుకోవచ్చని చెబుతున్నారు. కానీ ఆలయ పూజా సేవలో పాల్గొనకూడదట. అంటే శఠగోపం, రుద్రపాదాలను పెట్టించుకోకూడదని చెబుతున్నారు. అదేవిధంగా, ఉత్సవాలు చేయించడం వంటి వాటికీ దూరంగా ఉండాలట. ఏడాది పొడవునా పండుగలు, పుణ్య నదుల్లో స్నానం ఆచరించడం వంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.