Kali Yuga-The End : కలియుగం..శ్రీకృష్ణుడు..నలుగురు పాండవులు
Kali Yuga-The End : ఇది కలియుగం.. వేదాల ప్రకారం 4 యుగాలు ఉన్నాయి. ఇప్పుడు చిట్ట చివరిదైన కలియుగంలో మనం ఉన్నాం. కలియుగం ఎప్పుడు ముగుస్తుంది ?
- By Pasha Published Date - 02:45 PM, Sun - 18 June 23

Kali Yuga-The End : ఇది కలియుగం..
వేదాల ప్రకారం 4 యుగాలు ఉన్నాయి.
కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం గడిచిపోయాయి.
ఇప్పుడు చిట్ట చివరిదైన కలియుగంలో మనం ఉన్నాం.
మిగితా యుగాలు ముగిసినట్టుగా.. కలియుగం ఎప్పుడు ముగుస్తుంది ?
మహా భారతం మనిషి జీవితం, విశ్వంతో ముడిపడిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. కలియుగానికి కూడా అందులో సమాధానం ఉంది. ధర్మరాజు లేని సమయంలో మిగతా నలుగురు పాండవులు కలియుగం ఎలా ఉంటుందో చెప్పమని శ్రీకృష్ణుడిని అడిగారు. చిన్నగా నవ్విన శ్రీకృష్ణుడు.. చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు దిక్కుల్లో నాలుగు బాణాలు వేసి, తలో దిక్కుకు వెళ్లి వాటిని తీసుకు రమ్మన్నాడు. భీమార్జున నకుల సహదేవులు నలుగురూ ఆ బాణాలను వెతుక్కుంటూ తలో దిక్కున వెళ్లారు.
కొద్ది దూరం వెళ్లాక అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటువైపు చూశాడు. ఓ కోయిల మధురంగా పాడుతూ బతికున్న కుందేలును పొడుచుకు తింటోంది. దీన్ని చూసిన అర్జునుడు నివ్వెరపోయాడు.
భీముడికి బాణం దొరికిన చోట నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఎండిపోయిన ఒక బావి కనిపించింది. దీనికి అతడు ఆశ్చర్య పోయాడు.
నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగదూడను గాయాలయ్యేలా విపరీతంగా నాకుతోంది. చుట్టూ ఉన్న జనం అతి కష్టంతో దూడను ఆవు నుంచి వేరుచేశారు. ఈ సన్నివేశాన్ని చూసిన నకులుడికి ఆశ్చర్యమేసింది.
మరో దిక్కుకు వెళ్లిన సహదేవుడికి బాణం దొరికినచోట ఒక పర్వతం పైనుంచి ఒక పెద్ద బండరాయి దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పెకలిస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. ఏం జరుగుతుందో సహదేవుడికి అర్థం కాలేదు.
Also read : Hinduism : ఈ నాలుగు కారణాలే మిమ్మల్ని ధనవంతులను చేస్తాయి..!
శ్రీకృష్ణుడు చెప్పిన ఆన్సర్స్ అమోఘం
నలుగురూ శ్రీకృష్ణుడి దగ్గరికి తిరిగొచ్చారు. ముందుగా అర్జునుడుకి వచ్చిన సందేహం గురించి శ్రీకృష్ణుడు చెప్పాడు. కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న మాదిరిగా భక్తులను దోచుకుంటారు. తర్వాత భీముడి సందేహం గురించి వివరిస్తూ కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు. ఎలాగైతే ఆవు తన దూడను గాయాలయ్యేంతగా నాకిందో తలిదండ్రులు కూడా తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తారు. కలియుగంలో జనులు మంచి నడవడిక కోల్పోయి కొండ మీద నుంచి బండరాయి దొర్లినట్లుగా పతనం అవుతారు. భగవన్నామమనే చిన్న మొక్క తప్ప ఎవరూ వీరిని కాపాడలేరని శ్రీకృష్ణ పరమాత్ముడు పేర్కొన్నాడు.
కలియుగానికి ఇంకా ఎన్నేళ్లు మిగిలాయి ?
వేదాల ప్రకారం కలియుగంలో 4 లక్షల 32 వేల మానవ సంవత్సరాలు ఉంటాయి. ప్రస్తుత కాలాన్ని కలియుగం మొదటి దశ అంటారు. దీని ప్రకారం ఇప్పటివరకు కలియుగంలో 3102+2023=5125 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. అంటే కలియుగంలోని మొత్తం 4,32,000 సంవత్సరాలలో 5,125 సంవత్సరాలు(Kali Yuga-The End) పూర్తయినట్టే. ఇంకా 4,26,875 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి.
కలియుగంలో విష్ణువు అవతారం
ప్రపంచాన్ని రక్షించడానికి విష్ణువు వివిధ అవతారాలు ధరించాడు. అలా ఆయన రూపుదాల్చినవే దశావతారాలుగా గుర్తింపు పొందాయి. అందులోని పదవ, చివరి అవతారమే కల్కి అవతారంగా చెబుతారు. కల్కి అవతారంలో ఉన్న విష్ణువు శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి రోజున సంభాల అనే ప్రదేశంలో, విష్ణుయాశ అనే వ్యక్తి ఇంట్లో జన్మిస్తాడని చెబుతారు. ఈ అవతారంలో దేవదత్తుడు గుర్రంపై స్వారీ చేసి పాపులను నాశనం చేసి ప్రపంచంలోని భయం, అసహ్యతను మరోసారి అంతం చేస్తాడు. అప్పటి నుంచి స్వర్ణయుగం ప్రారంభమవుతుంది.
గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.