Nishkalank Mahadev : సముద్రగర్భంలో అరుదైన శివాలయం.. మనదేశంలోనే..
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్థిష్ట సమయం కాగానే సముద్ర అలలు వాటంతట అవే తగ్గి.. ఆలయ శిఖరం, ఆలయం, గుట్ట దర్శనమిస్తాయి. ఆ సమయాల్లోనే..
- By News Desk Published Date - 06:00 AM, Tue - 14 November 23

Nishkalank Mahadev : భారతదేశం సంస్కృతి, సాంప్రదాయలకు నెలవైన దేశం. వాటికి అనుగుణంగానే.. ఇక్కడ అనేక దేవాలయాలు ఉంటాయి. బడిలేని ఊరు ఉంటుందేమో గానీ.. గుడిలేని ఊరు ఉండదు. ఊరిమధ్యలో, కొండలపై, గుట్టలపై, ఊరిపొలిమేర్లలో తప్పనిసరిగా ఆలయాలు ఉంటాయి. అయితే వీటన్నింటికీ భిన్నంగా ఒక శివాలయం సముద్రగర్భంలో ఉంది. ఈ ఆలయంలో ఉన్న పరమేశ్వరుడు ప్రతినిత్యం ప్రత్యక్షంగా పూజలందుకుంటున్నాడు. సముద్రంలో ఉన్న ఈ ఆలయం గుజరాత్ లో ఉంది. దాని కథేంటో, పూజలు ఎలా చేస్తారో తెలుసుకుందాం.
గుజరాత్ లోని భావ్ నగర్ కు 30 కిలోమీటర్ల దూరంలో.. కొలియక్ అనే గ్రామంలో ఉన్న సముద్ర తీరం నుంచి సుమారు కిలోమీటరున్నర దూరంలో ఈ ఆలయం ఉంటుంది. సముద్రగర్భంలోని చిన్న గుట్టపై ఉండే ఈ శివాలయం రోజులో కొన్నిగంటలే కనిపిస్తుంది. మిగతా సమయంలో మునిగిపోయి ఉంటుంది. అందుకే దీనిని నిష్కళంక్ శివాలయం అని పిలుస్తారు.
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్థిష్ట సమయం కాగానే సముద్ర అలలు వాటంతట అవే తగ్గి.. ఆలయ శిఖరం, ఆలయం, గుట్ట దర్శనమిస్తాయి. ఆ సమయాల్లోనే భక్తులు ఆలయంలోకి వెళ్లి స్వామివారిని సేవించుకుని తిరిగివచ్చేస్తారు.
కురుక్షేత్ర సంగ్రామంలో జరిగిన ప్రాణనష్టానికి తల్లడిల్లిన పాండవులు.. ఆనాడు తమ పాప ప్రక్షాళనకు ఈ ఆలయాన్ని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఆలయాన్ని నిష్కళంక్ శివాలయం అంటారు.
ప్రతిరోజూ ఉదయం 11 గంటలు అవ్వగానే సముద్రం వెనక్కి తగ్గుతుంది. ఆ సమయంలో ఆలయం స్పష్టంగా కనిపిస్తుంది. మళ్లీ మధ్యాహ్నం అవగానే క్రమంగా ఆలయాన్ని ముంచుతూ.. అర్థరాత్రి అయ్యేసరికి 20 మీటర్ల ఎత్తైన ఆలయం ధ్వజస్తంభం సహా మొత్తం మునిగిపోతాయి. ధ్వజస్తంభంపై ఉన్న ఎగిరే జెండా మాత్రం ఆలయం గుర్తుగా కనిపిస్తుంటుంది. సముద్రం తగ్గినపుడు భక్తులు ఆలయంలో పూజలు చేస్తారు. కొన్నివందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ శివాలయానికి ప్రత్యేకంగా అమావాస్య, పౌర్ణమి తిథులలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు.