Gifts From Mithila : సీతమ్మ పుట్టినింటి నుంచి అయోధ్య రామయ్యకు కానుకలివీ..
Gifts From Mithila : బిహార్‌లోని మిథిలా నగరాన్ని సీతమ్మవారి పుట్టినిల్లుగా చెబుతారు.
- By Pasha Published Date - 08:01 AM, Fri - 22 December 23

Gifts From Mithila : బిహార్‌లోని మిథిలా నగరాన్ని సీతమ్మవారి పుట్టినిల్లుగా చెబుతారు. దేశవ్యాప్తంగా చాలాచోట్ల నుంచి నూతన అయోధ్య రామమందిరానికి కానుకలు వెల్లువెత్తుతున్నా.. మిథిల నుంచి వస్తున్న కానుకలు వెరీ స్పెషల్. ఎందుకంటే అవి శ్రీరాముడి అత్తవారింటి నుంచి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ మహోత్సవం కోసం మిథిలా నగరం నుంచి పాగ్ (తలపై ధరించే పగిడీలు), పాన్ (తాంబూలం), మఖానా (కలువ గింజలు) పంపనున్నారు. ఇందుకోసం మిథిలలోని పట్నా మహావీర్ మందిర్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి పట్నా మహావీర్ మందిర్ తరఫున రూ.10 కోట్ల విరాళం కూడా ఇచ్చారు. నాణ్యమైన పాన్, మఖానాలకు మిథిలా నగరం చాలా ఫేమస్. అందుకే రాముడిని గౌరవించుకునేందుకు రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇక్కడి నుంచి పాన్, మఖానాతో(Gifts From Mithila) పాటు పాగ్‌ను పంపుతున్నామని పట్నా మహావీర్ మందిర్ కార్యదర్శి కిశోర్ కునాల్ చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
‘మిథిల మఖానా’ ఏమిటిది ?
బీహార్‌లోని మిథిల ప్రాంతంలో పండించే ‘మిథిల మఖానా’ (కలువ గింజలు)కు భారత ప్రభుత్వం భౌగోళిక గుర్తింపును (జీఐ) ఇచ్చింది. పేరుకు తగినట్టే ఈ మఖానా మిథిలతో పాటు నేపాల్‌లో పండుతుంది. బీహార్ నుంచి జీఐ గుర్తింపు పొందిన ఐదో ఆహార పదార్థం మిథిల మఖానా. బీహార్ నుంచి భగల్‌పూర్ జర్దాలు మామిడి, కటార్ని ధాన్ (వడ్లు), నవడా మాఘాయి తమలపాకులు, ముజఫర్‌పూర్ షాహీ లిచ్చీ ఇంతకుముందే జీఐ గుర్తింపును పొందాయి. మిథిల మఖానాను సంక్షిప్తంగా ‘మఖాన్’ అంటారు. దీని శాస్త్రీయనామం ‘యూర్యేల్ ఫెరోక్స్ సాలిస్బ్’. ఇది నీళ్లలో పెరిగే కలువ గింజల రకానికి చెందింది. ఇంగ్లిష్‌లో దీన్ని ‘ఫాక్స్‌నట్’ అని పిలుస్తారు.
మఖానా.. ఆరోగ్య ప్రయోజనాలు
- మఖానాలు అనేవి కొలనులో కలువ, తామర పత్రాల మీద పెరుగుతాయి. వాటిని సేకరించి, కడిగి కొన్ని గంటలపాటు ఎండపెడతారు.
- ఆ తర్వాత వాటిని ఎక్కువ మంటమీద బాణలిలో వేయిస్తారు. దీంతో వాటి పెంకులు పేలి, పేలాల్లా తయారవుతాయి.
- కోజాగరి పూర్ణిమ పూజ సందర్భంగా మిథిలవాసులు వీటిని ఇష్టంగా తింటారు. ప్రత్యేకించి నవ దంపతులతో తినిపిస్తారు.
- మఖానా ఆరోగ్యకరమైన చిరుతిండి.
- ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఫైబర్, పొటాషియం, ఐరన్, జింక్ ఎక్కువ.
- వీటిలో కొలెస్ట్రాల్, కొవ్వు, సోడియం తక్కువ.
- వీటిలో కేలరీలు తక్కువ. కాబట్టి బరువు తగ్గడానికి దోహదపడతాయి.
- మసాలా దినుసులు చల్లుకొని తింటే మఖానాలు రుచికరంగా ఉంటాయి.
- మఖానాలు తింటే నిద్రలేమి, కీళ్లనొప్పులను అధిగమించవచ్చు.
- వీటిని తింటే మెదడు సామర్థ్యం కూడా మెరుగుపడుతుందని అంటారు.