G. Pulla Reddy : అయోధ్య పోరాటంలో పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పాత్ర ఎప్పటికీ మరచిపోలేము..
- By Sudheer Published Date - 12:09 AM, Mon - 22 January 24

నీల మేఘ శ్యాముడు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ మరికొద్ది గంటల్లో జరగనుంది. పురుషోత్తముడి రాక కోసం అయోధ్య సుందరంగా ముస్తాబు అవగా రామమందిరం విద్యుత్ దీపాల కాంతుల్లో వెలిగిపోతుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దేశమంతా శ్రీరాముడి నామమే జపిస్తోంది. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠను పురస్కరించుకుని అనేక చోట్ల ఈ వేడుకలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు అయోధ్యలో గుడి కట్టం…విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట చేసుకుంటున్నామని అంత సంతోష పడుతున్నాం కానీ ఈ సంతోషాన్ని తీసుకొచ్చేందుకు ఎంతో మంది ఎన్నో పోరాటాలు చేసారు. అలాంటి పోరాటంలో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కీలక పాత్ర పోషించింది. వీహెచ్‌పీ కోశాధికారిగా పని చేసిన పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత గుణంపల్లి పుల్లారెడ్డి రామ అయోధ్య ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన సంగతి ఎవ్వరు మరచిపోరు.
బాబ్రీ మసీదు కూల్చి వేసిన సమయంలో కోర్టు కేసుల విషయంలో రామ మందిరం నిర్మాణ ట్రస్టు వద్ద ఒక రూపాయి కూడా లేదు. అప్పట్లో విశ్వహిందూ పరిషత్తు రామ మందిర నిర్మాణం కోసం పోరాడేది. ఆలయ నిర్మాణ కేసు సుప్రీంకోర్టులో ఉండగా విశ్వహిందూ పరిషత్ ట్రస్టు వద్ద ఒక్క రూపాయి కూడా నిధులు లేకపోవడంతో విశ్వహిందూ పరిషత్ చైర్మన్ అశోక్ సింగల్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. వీహెచ్‌పీ అంతర్జాతీయ కోశాధికారి అయిన పుల్లారెడ్డి.. అయోధ్య రామ మందిర న్యాయపోరాటానికి అవసరమైన ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చారు. కోర్టు ఖర్చుల కోసం వీహెచ్‌పీకి రూ.25 లక్షలు అవసరమయ్యాయి. దీంతో వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ హైదరాబాద్ వచ్చి పుల్లారెడ్డిని కలిశారు. కోర్టు ఖర్చుల కోసం డబ్బు అవసరమైన అశోక్ సింఘాల్ చెపుతూ బాధపడగా.. పుల్లారెడ్డి వెంటనే ఇంట్లో నుంచి రూ.2 లక్షలు తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి, సాయంత్రంలోగా మరో రూ.10 లక్షలు సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చారు. తనకు తెలిసిన మిత్రుల దగ్గర డబ్బులు తీసుకొని అశోక్ సింఘాల్‌కు ఇచ్చారు. కోర్టు ఖర్చుల కోసం ఎర్రమంజిల్‌లోని తన ఇంటిని అమ్మేయడానికైనా సిద్ధమని, తన భార్య నగలు సైతం ఇచ్చేస్తానని పుల్లారెడ్డి చెప్పుకొచ్చారు. రామ మందిరం కోసం తన ఆస్తి మొత్తం ధారబోసేందుకు సిద్ధమన్నారు. రామ మందిరమే తన తొలి ప్రాధాన్యమని , తాను బతికి ఉన్నంత వరకు కోర్టు ఖర్చులకు ఎలాంటి లోటు రాకుండా చూస్తానని అశోక్ సింఘాల్‌కు పుల్లారెడ్డి హామీ ఇచ్చారు. పుల్లారెడ్డి మరణించిన తర్వాత ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అనంతరం శ్రద్ధాంజలి సభలో అశోక్ సింఘాల్ స్వయంగా ఈ విషయాలు వెల్లడించారు. అయోధ్య కేసులో గెలుస్తామని.. రామ మందిరం నిర్మాణం ఎప్పటికైనా జరిగి తీరుతుందని పుల్లారెడ్డి బలంగా నమ్మారు. ఇప్పుడు ఆ కల సాకారం అయ్యిందని అన్నారు.
ఇక పుల్లారెడ్డి పుట్టుక – జీవితం చూస్తే ..
1920, ఆగస్టు 12న కర్నూలు జిల్లాలోని గోకవరం గ్రామంలో పుల్లారెడ్డి జన్మించారు. ఐదో తరగతి వరకు చదువుకున్న పుల్లారెడ్డి.. కర్నూలులోని బాబాయి ఇంట్లో పనికి కుదిరారు. అక్కడ పని చేసే సమయంలో నారాయణమ్మను పెళ్లాడారు. జీతం సరిపోకపోవడంతో.. పని మానేసి.. రూ.25 అప్పు చేసి టీ వ్యాపారం ప్రారంభించారు.
తొలుత టీ దుకాణం, మజ్జిగ అమ్మడం, బట్టల దుకాణం వంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసినా, చిన్నాన్న ప్రోత్సాహంతో కర్నూలులో 1948లో ప్రారంభించిన మిఠాయిల దుకాణం అయన జీవితాన్ని మార్చివేసింది. తన వ్యాపార దక్షతతో పుల్లారెడ్డి మిఠాయిలను స్వచ్ఛతకు, రుచికి మారుపేరుగా నిల్పాడు. అనతికాలంలోనే పుల్లారెడ్డి నేతి మిఠాయిలు ప్రాచుర్యంలోకి రావడంతోపాటు వ్యాపారం కూడా విస్తరించింది. తరువాత 1957వ సంవత్సరం హైదరాబాద్ లోని అబిడ్స్ లో కూడా దుకాణాన్ని తెరిచారు. ఒక చిన్న దుకాణంగా ప్రారంభమైన అయన వ్యాపారం ఇప్పుడు వందల మంది పనివారితో విదేశాలకు సైతం మిఠాయిలు పంపేంతగా ఎదిగింది. పనివారిని సొంతమనుషుల్లా చూసుకుని వారికి ఇళ్లుకూడా కట్టించాడు.
పుల్లారెడ్డి 5వ తరగతి వరకు మాత్రమే చదివినప్పటికీ ఆయనకు చదువంటే అమితమైన అభిమానం. వ్యాపారంలో ఎదిగిన కొద్దీ ప్రజలకు, సమాజానికి ఏమైనా చేయాలన్న తపనతో 1975వ సంవత్సరం హైదరబాద్ లో జి. పుల్లారెడ్డి ఛారిటీస్ ట్రస్ట్ ను ఏర్పరిచి దాని ద్వారా విద్యావ్యాప్తికై కృషిచేశాడు. 1984-85 లో జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను,1994 -95లో జి.పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలను, మహిళల కోసం 1997లో జి.నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించాడు. ట్రస్ట్ తరపున ఎందరో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తూ విద్యావ్యాప్తికి తనవంతు కృషి చేసాడు. కర్నూలు జిల్లాలోని పాఠశాలల అభివృద్ధికి సహాయం చేశాడు. అనాథ బాలురకోసం విజ్ఞాన పీఠం పేరుతొ విద్యాలయాన్ని స్థాపించి వారికి విద్యతో పాటు వసతి, భోజన ఏర్పాట్లను చూశాడు.
పుల్లారెడ్డి పై భారత దేశ సంస్కృతీ సంప్రదాయాలతో పాటు, హిందూ మత ప్రభావం ఉంది. తన దానధర్మాలలో భాగంగా అనేక దేవాలయాల పునరుద్ధరణకు, నిర్మాణాలకు భూరి విరాళాలు ఇచ్చాడు. ఆ క్రమం లోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.), విశ్వ హిందూ పరిషత్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారు. ఆర్.ఎస్.ఎస్ లో 1974లో సర్ సంఘ్ చాలక్ అయ్యాడు. 1980లో విశ్వ హిందూ పరిషత్ హైదరాబాద్ శాఖకు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. సంస్కృత భాషా ప్రచార సమితి అధ్యక్షునిగా, విశ్వ హిందూ పరిషత్ జాతీయ కోశాధికారిగా, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా అనేక బాధ్యతలు నిర్వర్తించాడు. వీరి మరణానంతరం వీరి కుమారుడు జి.రాఘవ రెడ్డి విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడయ్యాడు.
Read Also : Stones Thrown : శ్రీరాముడి శోభాయాత్ర పై రాళ్ల దాడి