Amaran Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్నా శివ కార్తికేయన్, సాయి పల్లవి అమరన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తాజా హిట్ మూవీ ‘అమరన్’ ఓటీటీలోకి రాబోతుంది. నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ఈ వార్తను ప్రకటించింది.
- By Kode Mohan Sai Published Date - 01:15 PM, Sat - 30 November 24

శివ కార్తికేయన్ మరియు సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘అమరన్’ దీపావళి కానుకగా విడుదలై భారీ హిట్‌గా నిలిచింది. సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు విడుదల అవుతుంది అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. వారి ఆసక్తికి ఫుల్‌స్టాప్ పెడుతూ, ‘అమరన్’ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అనే ప్రశ్నకు నెట్‌ఫ్లిక్స్ (Netflix) అధికారికంగా సమాధానం ఇచ్చింది.
డిసెంబర్ 5 నుంచి ‘అమరన్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది.
2014లో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.

Amaran Netflix
కథ సారాంశం:
ఐదేళ్ల వయసు నుంచే సైనికుడిగా అవాలని కలలు కన్న ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్). మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు, తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు రెబెకా వర్గీస్ (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఇంతలో, భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్ అధికారిగా ఎంపికవుతాడు. ట్రైనింగ్ పూర్తయిన తరువాత, 22 రాజ్‌పుత్ రెజిమెంట్‌లో చేరి, విధులు నిర్వహించుకుంటాడు.
ముకుంద్ ఇంట్లో వీరి ప్రేమను స్వీకరించినప్పటికీ, ఇందు ఇంట్లో ఒప్పుకోరు. అయితే, తన ప్రేమను విడిచిపెట్టకుండా, ఇందు కుటుంబాన్ని ఒప్పించి ప్రేమను కొనసాగిస్తాడు. ఆ తర్వాత, వారి వ్యక్తిగత జీవితం ఎలా కొనసాగింది? ముకుంద్ సైనిక జీవితం ఎలాంటి సవాళ్లతో కూడి ఉంది?
ముఖ్యంగా, ముకుంద్ మేజర్‌గా పదోన్నతి పొందాక, రాజ్‌పుత్ రెజిమెంట్ నుండి రాష్ట్రీయ రైఫిల్స్‌కు డిప్యుటేషన్‌పై వచ్చాక, ఆయన ఎదుర్కొన్న ప్రత్యేక ఆపరేషన్లు ఏమిటి? అన్నది ‘అమరన్’ సినిమాలో చూడాల్సిందే.