Akira Nandan : సినీ పరిచయాలు కంటే ముందు పొలిటికల్ పరిచయాలు..
పవన్ తన కొడుకు అకిరాకి సినీ పరిచయాలు కంటే ముందు పొలిటికల్ పరిచయాలు చేస్తున్నారు. మొన్న బాబు, నేడు మోదీతో అకిరా మీటింగ్.
- Author : News Desk
Date : 06-06-2024 - 5:46 IST
Published By : Hashtagu Telugu Desk
Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ సినీ తెరగేంట్రం కోసం మెగా అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అకిరా హీరోగా ఎంట్రీ ఇస్తాడా..? లేదా మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటింగ్ అంటూ మరో క్రాఫ్ట్ వైపు అడుగులు వేస్తాడా..? అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది. ఇది ఇలా ఉంటే, తాజాగా అకిరాకి సంబంధించిన కొన్ని ఫోటోలు చూస్తుంటే మరో సందేహం పుట్టుకొస్తుంది.
పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు అకిరాని సినీ వేదికల పై తన వారసుడిగా పరిచయం చేయలేదు. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు అకిరాని సినీ రంగానికి దూరంగా ఉంచుతూనే వచ్చారు. వారసుడిని ఇలా సినిమాకి దూరంగా ఉంచిన పవన్ కళ్యాణ్.. పాలిటిక్స్ లో మాత్రం కొంచెం త్వరగానే పరిచయం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే.
తాను గెలవడమే కాకుండా కూటమి పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీలు గెలవడంలో కూడా పవన్ కీలక పాత్ర పోషించారు. దీంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బీజేపీ అధ్యక్షుడు మరియు పీఎం నరేంద్ర మోదీ నుంచి పవన్ కి అభినందనలు వస్తున్నాయి. ఇక ఆ అభినందనలు స్వీకరించడం కోసం పవన్ తన తనయుడు అకిరాతో కలిసి వెళ్లడం అందరికి ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది.
ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్.. తన మెగా వారసులు రామ్ చరణ్, వరుణ్ తేజ్ మరియు ఇతర హీరోలను కూడా పాలిటిక్స్ కి దూరంగా ఉంచారు. కానీ ఇప్పుడు తన టీనేజ్ కుమారుడు అకిరాని తీసుకోని వెళ్లి మరి.. చంద్రబాబుకి, నరేంద్ర మోదీకి పరిచయం చేసి, వారి ఆశీర్వాదాలను కొడుకుకి అందేలా చేస్తున్నారు. కొడుకుకి సినీ పరిచయాలు కంటే ముందు పొలిటికల్ పరిచయాలు చేయిస్తున్న పవన్.. ఆలోచన వెనుక కారణం ఏమైనా ఉందా..? లేదా నార్మల్ పరిచయాలేనా..? అనేది పవనే చెప్పాలి.