Gabbar Singh : గబ్బర్ సింగ్ రీ రిలీజ్.. మళ్ళీ ఆ రోజుల్ని గుర్తు చేస్తారా..?
గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కి డేట్ ఫిక్స్ అయ్యింది. మరి పవన్ ఫ్యాన్స్ మళ్ళీ ఆ పాత రోజుల్ని గుర్తు చేస్తారా, లేదా..? చూడాలి.
- By News Desk Published Date - 05:08 PM, Wed - 17 July 24

Gabbar Singh : 12ఏళ్ళ క్రితం టాలీవుడ్ లో వచ్చిన తుఫాన్ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ తుఫాన్ అప్పటివరకు ఉన్న రికార్డులు, కలెక్షన్ల లెక్కలన్నిటిని మార్చేసింది. మళ్ళీ ఆ తుఫాను ఇప్పుడు రాబోతుంది. ఇప్పటికే ఆ తుఫాన్ ఏంటో మీకు అర్థమయ్యుండాలి. దాదాపు 12ఏళ్ళ పాటు పవన్ కళ్యాణ్ నుంచి ఒక్క హిట్ లేక బాధ పడుతున్న అభిమానులను.. గబ్బర్ సింగ్ ఒక తుఫాన్ లా తాకింది. ఆ తాకిడికి వచ్చిన రీసౌండ్ తెలుగు మీడియాలోనే కాదు, నేషనల్ మీడియాలో కూడా వినిపించింది.
బాలీవుడ్ హిట్ మూవీ ‘దబాంగ్’కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు మూవీ పై చాలా నిరాశలు అలుముకున్నాయి. రీమేక్ సినిమా కావడం, అంతకుముందే పవన్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన కొమరం పులి ప్లాప్ అవ్వడం, శృతిహాసన్ కి ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ఉండడం, నిర్మాత బండ్ల గణేష్ కూడా వరుస ప్లాప్ ల్లో ఉండడం.. ఇలా ప్రతి పాయింట్ పవన్ ఫ్యాన్స్ లో నిరాశని పెంచింది. ఇక ఆ నిరాశలతోనే థియేటర్స్ లోకి వెళ్లిన పవన్ ఫ్యాన్స్.. బయటకి పోతురాజులా ఆడుతూ వచ్చారు.
సినిమాలోనో ప్రతి విషయం ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో థియేటర్స్ అప్పటివరకు చూడని ఒక పెద్ద సంబరం అప్పుడు కనిపించింది. పాలాభిషేకాలు, తీనామర్ జాతరలు.. కొన్నిరోజుల పాటు గబ్బర్ సింగ్ ఉత్సవం కనిపించింది. పవన్ అభిమానులకు ఆ రోజులు ఒక అద్భుతమైన కల లాంటిది. అయితే ఇప్పుడు ఆ కలని మళ్ళీ రీ క్రియేట్ చేసుకొనే అవకాశం వస్తుంది. అవును థియేటర్స్ లోకి మళ్ళీ గబ్బర్ సింగ్ వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ ని రీ రిలీజ్ చేయబోతున్నారు. మరి పవన్ ఫ్యాన్స్ ఆ పాత రోజుల్ని గుర్తు చేస్తారా, లేదా..? చూడాలి.