నీలకంఠ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్
వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా నూతన సంవత్సరం కానుకగా జనవరి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన నీలకంఠ భారీ హిట్ అందుకుంది. మొదటి రోజే కోటి రూపాయల కలెక్షన్ అందుకుని.. రూరల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది
- Author : Sudheer
Date : 04-01-2026 - 1:01 IST
Published By : Hashtagu Telugu Desk
మాస్టర్ మహేంద్రన్ హీరోగా రాకేష్ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నీలకంఠ’ చిత్రం జనవరి 2న విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చిన్న చిత్రంగా, పరిమిత థియేటర్లలో విడుదలైనప్పటికీ, మొదటి రోజే ఏకంగా ఒక కోటి రూపాయల (1 Cr) వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథాంశం కావడంతో బి, సి సెంటర్లలో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం సక్సెస్ మీట్ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు శ్రీనివాసులు, వేణుగోపాల్ మాట్లాడుతూ.. తమ టీమ్ పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.

Neelakanta Movie Talk
ఈ విజయోత్సవ సభలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనిల్ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేశాయి. సినిమా పట్ల ప్యాషన్‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వదిలేసి, పదేళ్ల పాటు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నామని ఆయన ఉద్వేగంతో తెలిపారు. తమకు పెద్దగా థియేటర్లు దొరకలేదని, డిస్ట్రిబ్యూటర్ల సపోర్ట్ లేకపోయినా కంటెంట్‌ను నమ్మి ముందుకెళ్లామని చెప్పారు. “మాకు కోట్లు సంపాదించాలనే టార్గెట్ లేదు, నీలకంఠ ప్రతి ఒక్కరికీ చేరువవ్వాలి” అని పేర్కొన్న ఆయన, సినిమా నచ్చిన వారు తమకు తోచిన మొత్తాన్ని ఇవ్వచ్చని కూడా ప్రకటించడం గమనార్హం. కేవలం రూ. 100 టికెట్ ధరతోనే ఈ స్థాయి కలెక్షన్స్ రావడం తమ సత్తాకు నిదర్శనమని టీమ్ గర్వంగా చెప్పుకొచ్చింది.
హీరో మహేంద్రన్ మరియు హీరోయిన్ యశ్న ముతులూరి తమ సక్సెస్ క్రెడిట్‌ను ప్రేక్షకులకు, మీడియాకు అంకితం చేశారు. “ఆర్టిస్టులు సినిమాతో గెలవరు, నిర్మాతలతో గెలుస్తారు” అని చెబుతూ, తమను నమ్మి పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు మహేంద్రన్ ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు రాకేష్ ప్రతి షాట్ కోసం ఎంతో శ్రమించారని, స్పాట్‌లో ఏడ్చి మరి తనకు కావాల్సిన అవుట్‌పుట్ తీసుకునేవారని దర్శకుడి పట్టుదలను గుర్తుచేసుకున్నారు. సంక్రాంతి వరకు ఈ సినిమా ప్రమోషన్లను కొనసాగిస్తామని, ఇంకా చూడని వారు థియేటర్లకు వెళ్లి ఈ ‘మంచి పుస్తకం’ లాంటి సినిమాను ఆదరించాలని చిత్ర యూనిట్ విన్నవించింది.