Aalim Hakim : సూపర్ స్టార్లు, మెగా క్రికెటర్లకు ఈయనే హెయిర్ స్టయిలిస్ట్
హెయిర్ స్టైలింగ్(Aalim Hakim) చేసే కళను తన తండ్రి దివంగత హకీమ్ కైరన్వీ నుంచి ఆలిం హకీమ్ నేర్చుకున్నారు.
- By Pasha Published Date - 04:03 PM, Mon - 24 March 25

Aalim Hakim : మనం నిత్యం హెయిర్ కటింగ్ చేయించుకుంటూ ఉంటాం. ఇందుకోసం రూ.100 నుంచి రూ.500 దాకా ఖర్చు పెడుతుంటాం. అయితే సినిమా హీరోలు, సూపర్ స్టార్లు ఇందుకోసం లక్షలు ఖర్చు పెడుతుంటారు. నిజమే.. సినిమాల్లో నటించే క్రమంలో పాత్రలకు తగ్గట్టుగా హెయిర్ స్టయిల్ అవసరం. హెయిర్ స్టయిల్ సరిగ్గా ఉంటేనే.. ప్రజలు ఆ పాత్రకు దగ్గరవుతారు. ఇందుకోసం సినిమా నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టి మరీ హీరోలు, అన్ని పాత్రల నటులకు హెయిర్ స్టయిల్‌ను సెట్ చేయిస్తుంటారు. మహేశ్ బాబు నుంచి రజినీకాంత్ దాకా ఎంతోమంది సినీ స్టార్లకు హెయిర్ స్టైల్‌ను సెట్ చేసిన ఓ వ్యక్తి గురించి మనం తెలుసుకోబోతున్నాం.
Also Read :Hyderabad Restaurants : ఛీఛీ.. హైదరాబాద్ హోటళ్లపై రైడ్స్.. దారుణాలు వెలుగులోకి
గోల్డెన్ హ్యాండ్
ఆలిం హకీమ్.. మన దేశంలోని మూవీ ఇండస్ట్రీలో బాగా ఫేమస్. ఈయన పేరు చెప్పగానే మహేశ్ బాబు నుంచి రజినీ కాంత్ దాకా, ధోనీ నుంచి కొహ్లీ దాకా అందరూ గుర్తుపడతారు. ఎందుకంటే వాళ్లకు హెయిర్ స్టైల్‌ను సెట్ చేసింది ఈయనే. సెలబ్రిటీలకు హెయిర్ డ్రెస్సర్‌గా ఆలిం హకీమ్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఎంతోమంది ప్రముఖ నటులు, క్రికెటర్లకు హెయిల్ స్టైల్‌ను ఈయన సెట్ చేశారు. నటులు, క్రికెట్ ప్లేయర్లు గ్లామరస్‌గా కనిపించాలంటే ఆకర్షణీయమైన హెయిర్ స్టైల్ కావాలి. దాన్ని అందించే గోల్డెన్ హ్యాండ్ ఆలిం హకీమ్‌ది.
తండ్రి నుంచి పొందిన స్ఫూర్తితో..
హెయిర్ స్టైలింగ్(Aalim Hakim) చేసే కళను తన తండ్రి దివంగత హకీమ్ కైరన్వీ నుంచి ఆలిం హకీమ్ నేర్చుకున్నారు. హకీమ్ కైరన్వీ తన జీవిత కాలంలో దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్, సునీల్ దత్, శశికపూర్ లాంటి స్టార్లకు హెయిర్ స్టైలిస్ట్‌గా పనిచేశారు. ఆయన 39 ఏళ్ల వయసులోనే చనిపోయారు. తండ్రి చనిపోయే సమయానికి ఆలిమ్ వయసు 9 ఏళ్లే. అయినా తండ్రి నుంచి పొందిన స్ఫూర్తితో, తాను కూడా హెయిర్ స్టైలిస్టుగా ఆలిం హకీమ్ మారారు. వీఐపీలు, స్టార్లకు అద్భుత హెయిర్ స్టైల్‌ను అందించి అందరి మనసులను గెల్చుకున్నారు.
క్యూ కట్టి మరీ..
1990వ దశకంలో ఆలిమ్‌కు మంచి గుర్తింపు లభించింది. చాలామంది నటులు తమ హెయిర్ స్టైల్‌ను సెట్ చేసుకునేందుకు ఆయన వద్దకు క్యూ కట్టడం మొదలుపెట్టారు. సల్మాన్ ఖాన్, సైఫ్ అలీఖాన్, సునీల్ శెట్టి, అజయ్ దేవగన్, ఫర్దీన్ ఖాన్ వంటి వారు 20 ఏళ్ల క్రితమే ఆలిమ్‌కు క్లయింట్లుగా మారారు. రజినీకాంత్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి స్టార్లు కూడా ఆలిమ్‌ను పిలిపించి మరీ తమ హెయిర్ స్టైల్‌ను సెట్ చేయించుకున్నారు. ‘యానిమల్’ మూవీలో రణ్ బీర్ కపూర్ లుక్, ‘వార్’ మూవీలో హృతిక్ రోషన్ లుక్, ‘జైలర్’ మూవీలో రజనీ కాంత్ లుక్ వరకు ప్రతీ హెయిర్ స్టైల్ వెనుక ఆలిమ్ హకీమ్ ఉన్నారు. స్టార్ క్రికెటర్లు విరాట్ కొహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీల హెయిర్ లుక్ వెనుక ఉన్నదీ ఆయనే.