Fish Venkat : ఇంటి వద్ద ఫిష్ వెంకట్ భౌతికకాయం..పట్టించుకోని చిత్రసీమ
Fish Venkat : సినీ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలు గడిపినప్పటికీ, చివరికి మద్దతుగా నిలిచే వారెవరూ లేకపోవడం సినీ వర్గాలపై విమర్శలకు దారితీస్తోంది
- Author : Sudheer
Date : 19-07-2025 - 11:34 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు చిత్రసీమలో హాస్య నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ (Fish Venkat) ఇక లేరనే వార్త ఆయన అభిమానులను, సినీ ప్రేమికులను విషాదంలో ముంచింది. వందకు పైగా చిత్రాల్లో నటించిన ఫిష్ వెంకట్ భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అనేక హిట్ సినిమాల్లో నటించినప్పటికీ, ఆయన జీవితం చివరిదశలో ఆర్థిక ఇబ్బందులతో నిండి ఉండటం బాధాకర విషయం. సినీ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలు గడిపినప్పటికీ, చివరికి మద్దతుగా నిలిచే వారెవరూ లేకపోవడం సినీ వర్గాలపై విమర్శలకు దారితీస్తోంది.
గత తొమ్మిది నెలలుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఫిష్ వెంకట్‌కు వైద్యులు కిడ్నీ మార్పిడి అవసరం అని సూచించారు. ఈ ఆపరేషన్‌కు దాదాపు రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని, ఆర్థికంగా వెనుకబడ్డ ఆయన కుటుంబం తీవ్రంగా ఇబ్బంది పడుతోందని కుమార్తె స్రవంతి వెల్లడించారు. కొంతమంది అభిమానులు, ప్రముఖులు సహాయాన్ని అందించినా, సరైన దాత దొరకకపోవడం, అవసరమైన మొత్తాన్ని సమకూర్చలేకపోవడం వల్ల చికిత్సలో ఆలస్యం జరిగింది. ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంకట్ తుదిశ్వాస విడిచారు.
DMK Legacy Loss: కరుణానిధి కుమారుడు ముత్తు కన్నుమూత
ఆయన మరణానికి సంబంధించి ఇప్పటివరకు టాలీవుడ్ ప్రముఖుల నుంచి స్పందన లేకపోవడం, ఒక్క ట్వీట్ గానీ సందేశం గానీ ఇవ్వకపోవడం సినీ అభిమానుల్లో ఆవేదనను పెంచుతోంది. సినిమాల్లో చిన్నా పెద్దా పాత్రలు పోషించిన నటీనటుల పరిస్థితి దయనీయంగా మారుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిష్ వెంకట్ లాంటి వారు చివరికి ఆసరా లేకుండా చనిపోవడం చిత్రసీమ నిస్సహాయతను మరోసారి బయటపెట్టింది.
ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) స్థాయిలో ఓ బలమైన ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. హాస్య నటులు, సహాయ నటులకు తీవ్రమైన పరిస్థితుల్లో వైద్య సహాయం అందించేందుకు, ఆర్థికంగా దెబ్బతిన్న వారికి మద్దతుగా నిలిచే విధంగా ఓ సంస్థ ఉండాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ఫిష్ వెంకట్ మరణం చిత్ర పరిశ్రమకు కీలక గుణపాఠంగా నిలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.