Sri Rama Character : ఇప్పుడు ప్రభాస్ రాముడిగా.. కానీ మొదటిసారి రాముడి పాత్ర వేసింది ఎవరో తెలుసా?
రామ కథని చుపించాలన్నా, ఆ కథలో నటించాలన్నా అదృష్టం ఉండాలి అంటారు. మరి అలాంటి కథని మన తెలుగు ఆడియన్స్ కి ముందుగా చూపించిన వారు ఎవరో తెలుసా..?
- By News Desk Published Date - 09:00 PM, Wed - 14 June 23

ప్రభాస్ (Prabhas) రాముడిగా నటిస్తున్న సినిమా ఆదిపురుష్(Adipurush) విడుదలకు రెడీ అవుతుంది. ఈ మూవీ పై ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. సుగుణాభిరాముడి కథను ఎన్నిసార్లు, ఎన్ని విధాలుగా చూపించిన అసలు బోర్ కొట్టదు. సూపర్ హిట్ రామాయణ(Ramayanam) సీరియల్ లో నటించిన ఒక నటుడు ఇలా అన్నారు.. “రామాయణానికి మ్యాన్ ఫ్యాక్చరింగ్ తేదీ ఉంటుంది గానీ ఎక్స్‌పైరీ తేదీ లేదు”. ఆ మాట అక్షర సత్యం అనే చెప్పాలి. రామ కథని చుపించాలన్నా, ఆ కథలో నటించాలన్నా అదృష్టం ఉండాలి అంటారు. మరి అలాంటి కథని మన తెలుగు ఆడియన్స్ కి ముందుగా చూపించిన వారు ఎవరో తెలుసా..?
1932లో ‘పాదుకా పట్టాభిషేకం’ పేరుతో తెలుగులో తొలి రామాయణం రూపుదిద్దుకుంది. బాదామి సర్వోత్తం ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో రాముడి పాత్రలో ‘యడవల్లి సూర్యనారాయణ’ కనిపించారు. ఈ సినిమాతో వెండితెర తొలి రాఘవుడిగానే కాదు సినీ రంగానికి కూడా పరిచయం అయ్యారు సూర్యనారాయణ. ఈ చిత్రంలో సీతగా ‘సురభి కమలాబాయి’ నటించగా, హనుమంతుడి పాత్రలో చిలకలపూడి సీతారామాంజనేయులు కనిపించారు. సాగర్ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించింది. మరో విశేషం ఏంటంటే.. తెలుగులో 2వ టాకీ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కింది.
తండ్రి మాటకై రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్లిన రాముడిని వెతుకుంటూ వెనుకాలే వెళ్లిన భరతుడు.. అన్నని వచ్చి రాజుగా రాజ్యాధికారం తీసుకోవాలని కోరతాడు. కానీ రాముడు నిరాకరించడంతో రామ పాదరక్షలను రాజ్యానికి తీసుకు వచ్చి వాటికి పట్టాభిషేకం చేసి రాజ్యం పాలిస్తాడు భరతుడు. ఈ కథాంశంతోనే పాదుకా పట్టాభిషేకం సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం తరువాత చిలకలపూడి సీతారామాంజనేయులు, అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు, శోభన్ బాబు, బాలకృష్ణ, సుమన్, శ్రీకాంత్… మరికొంతమంది నటులు శ్రీరాముడిగా కనిపించి అలరించారు.