Bigg Boss Demon Pavan: డెమాన్ పవన్ ఇంట విషాదం..శోకసంద్రంలో రీతూ
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రన్నరప్, సామాన్యుడిగా హౌస్‌లోకి అడుగుపెట్టి టాప్ 3 వరకు దూసుకెళ్లిన డెమాన్ పవన్ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది
- Author : Sudheer
Date : 10-03-2026 - 3:49 IST
Published By : Hashtagu Telugu Desk
Demon Pawan Father : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రన్నరప్, సామాన్యుడిగా హౌస్‌లోకి అడుగుపెట్టి టాప్ 3 వరకు దూసుకెళ్లిన డెమాన్ పవన్ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న పవన్ తండ్రి దుర్గాప్రసాద్ (62), మంగళవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. పవన్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించినప్పటికీ, తన కొడుకు విజయం సాధించాలని కోరుకుంటూ అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన ధైర్యంగా నిలబడ్డారు. పవన్ ఫినాలే వరకు చేరుకోవడంలో ఆయన ఆశీస్సులు, స్ఫూర్తి ఎంతో కీలక పాత్ర పోషించాయి.
బిగ్ బాస్ సీజన్ 9 ‘ఫ్యామిలీ వీక్’ సమయంలో దుర్గాప్రసాద్ గారు స్టేజ్‌పైకి వచ్చిన దృశ్యం ప్రేక్షకుల హృదయాలను కలచివేసింది. క్యాన్సర్ కారణంగా దవడ భాగంలో సర్జరీ జరగడంతో ఆయనకు మాటలు సరిగా రాకపోయినా, కొడుకుని చూసి పొందిన ఆనందం అందరినీ ఎమోషనల్ చేసింది. ఆ సమయంలో నాగార్జున గారిని ఆయన ఆలింగనం చేసుకున్న తీరు, “నా కొడుకు వల్ల మీలాంటి గొప్ప వ్యక్తిని కలిశాను” అని చెప్పిన మాటలు షో చరిత్రలోనే అత్యంత ‘హార్ట్ టచ్చింగ్’ మూమెంట్స్‌గా నిలిచిపోయాయి. తన తండ్రికి నాలుకపై పన్ను గుచ్చుకోవడం వల్ల సెప్టిక్ అయ్యి, అది క్యాన్సర్‌గా మారిందని పవన్ హౌస్‌లో చెబుతూ కన్నీరు పెట్టుకున్న సందర్భాలు అభిమానులకు ఇప్పటికీ గుర్తే.

Demon Pawan Father died
క్యాన్సర్ చికిత్స అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో దుర్గాప్రసాద్ అకస్మాత్తుగా మరణించడం పవన్‌కు, ఆయన కుటుంబానికి కోలుకోలేని దెబ్బ. పవన్ విజేతగా నిలవకపోయినా, టాప్ 3లో నిలిచి తండ్రి కన్న కలలను కొంతవరకైనా నిజం చేయగలిగారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు, అభిమానులు పవన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. పవన్ స్నేహితురాలు రీతూ చౌదరి కూడా ఈ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పవన్ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నెటిజన్లు నివాళులర్పిస్తున్నారు.