Nenu Maa Avida : ‘నేను మా ఆవిడ’.. శారదకి వచ్చిన డౌట్.. అందర్నీ కడుపుబ్బా నవ్వించింది..
చంద్రమోహన్ హీరోగా, ప్రభ హీరోయిన్ గా తెరకెక్కిన 'నేను మా ఆవిడ' చిత్రం 1981లో రిలీజ్ అయ్యి రేలంగి నరసింహారావుని దర్శకుడిగా ఆడియన్స్ కి పరిచయం చేసింది.
- By News Desk Published Date - 10:30 PM, Sat - 6 January 24

టాలీవుడ్ రచయిత రేలంగి నరసింహారావు.. దాసరి నారాయణ(Dasari Narayana) దగ్గర శిష్యరికం చేస్తూ మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. 1980లో ‘చందమామ’ అనే సినిమాని డైరెక్ట్ చేసి దర్శకుడిగా పరిచయం అయ్యారు. అయితే ఆ మూవీ కొన్ని కారణాలు వల్ల 1982 వరకు రిలీజ్ కాలేదు. ఈలోపు ఆయన డైరెక్ట్ చేసిన రెండో సినిమా ‘నేను మా ఆవిడ'(Nenu Maa Avida) ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. చంద్రమోహన్ హీరోగా, ప్రభ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం 1981లో రిలీజ్ అయ్యి రేలంగి నరసింహారావుని దర్శకుడిగా ఆడియన్స్ కి పరిచయం చేసింది.
కాగా ఈ మూవీకి ‘నేను మా ఆవిడ’ అనే టైటిల్ ఎలా వచ్చిందంటే.. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ లో దాసరి నారాయణ కూడా పాల్గొన్నారు. ఇక ఆయన శిష్యుడు అయ్యిన రేలంగి నరసింహారావు.. సినిమాలోని మొదటి సాంగ్ ని గురువు దాసరి నారాయణనే రాయమని కోరారు. దీంతో సినిమా కథ మొత్తం తెలిసిన దాసరి కథకి అనుగుణంగా మొదటి సాంగ్ ని రాశారు. “పాలు, మీగడ.. పెరుగు, ఆవడ.. ఒకటికి ఒకటై.. రెండు తోడై.. కలిసిన జోడ.. నేను మా ఆవిడ” అని రాశారట. అలాగే ‘నేను మా ఆవిడ’ అనే పదానే టైటిల్ గా పెట్టుకోమని చెప్పారట. ఇక గురువు టైటిల్ ఇవ్వడంతో మరో మాట మాట్లాడకుండా రేలంగి అదే టైటిల్ ని పెట్టేశారు.
ఒకరోజు సెట్ లొకేషన్ చూడడానికి రేలంగి ఒక స్టూడియోకి వెళ్లారట. ఆ సమయంలో నటి శారద(Actress Sharada) నటిస్తున్న ఒక సినిమా షూటింగ్ అక్కడ జరుగుతుంది. ఇక రేలంగిని చూసిన శారద ఆయనని పలకరించి.. ఏంటి ఇలా వచ్చారని ప్రశ్నించారు. రేలంగి బదులిస్తూ.. “నేను మా ఆవిడ సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. దాని లొకేషన్ కోసం వచ్చాను” అని చెప్పారట. ఆమె అవునా అని ‘ఊ’ కొట్టారు. ఇక రేలంగి లోపలికి వెళ్లి సెట్ చూసుకొని వచ్చి వెళ్ళిపోతున్న సమయంలో శారద, రేలంగిని పిలిచారట.
రేలంగిని పిలిచిన శారద.. “మీ ఆవిడ కూడా దర్శకురాలా..?” అని ఆశ్చర్యంగా ప్రశ్నించారట. రేలంగి బదులిస్తూ.. “మా ఆవిడకి సినిమా పరిశ్రమకి అసలు సంబంధం లేదండి. ఆవిడ డైరెక్ట్ చేయడం ఏంటి..?” అని అన్నారట. దానికి శారద.. “మీరే కదా నేను మా ఆవిడ డైరెక్ట్ చేస్తున్నాను అని చెప్పారు” అని ప్రశ్నించారు. దానికి రేలంగి, అక్కడే ఉన్న ప్రొడ్యూసర్ కడుపుబ్బా నవ్వుకొని.. అది టైటిల్ అని బదులిచ్చారట. ఇక ఆ సంఘటన తరువాత రేలంగిలో.. దాసరి ఇచ్చిన ఆ టైటిల్ మూవీకి కరెక్ట్ అనే భావన పూర్తిగా కలిగిందట.

Also Read : Salaar : జపాన్‌లో కూడా సలార్ గ్రాండ్ రిలీజ్.. ఎప్పుడో తెలుసా?