T.P. Madhavan : చిత్రసీమలో మరో విషాదం – ప్రముఖ నటుడు కన్నుమూత
Malayalam actor T.P. Madhavan : గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొల్లంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి
- By Sudheer Published Date - 04:46 PM, Wed - 9 October 24

మలయాళ చిత్రసీమలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. మలయాళ సీనియర్ నటుడు టీపీ మాధవన్ (T.P. Madhavan) (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొల్లంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. బహుముఖ పాత్రలకు పేరుగాంచిన మాధవన్ 600కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన 2016లో విడుదలైన ‘మాల్గుడి డేస్’లో చివరగా నటించారు. ఆయన కెరియర్లో నాడోడిక్కట్టు, పందిప్పాడ, ఆర్డినరీ, అయల్ కధ ఎళుత్తుకాయన్, నమ్మాల్, నరసింహం, ఓరు సీబీఐ డైరీ కురుప్పు, మూనమ్ మురా, అచ్చువెట్టంటే వీడు, సందేశం మరియు ఆరం తంపురాన్ వంటి కొన్ని చిత్రాలు మంచి పేరును తీసుకువచ్చాయి.
అలాగే మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మ అసోషియేషన్‌కు మాధవన్ మొదటి జనరల్ సెక్రటరీగా బాధ్యతలు సైతం చేపట్టారు. 1975లో రాగం అనే సినిమాతో కెరీర్ ఆరంభించిన మాధవన్ అదే సంవత్సరం అర డజన్‌కు పైగా చిత్రాలు చేయడం విశేషం. తన 40 ఏండ్ల వయసులో విలన్ పాత్రలతో కెరీర్ ఆరంభించిన మాధవన్ 2016 వరకు అలుపు లేకుండా 600కు పైగా చిత్రాలలో నటించారు. విలన్ నుంచి కమెడియన్‌గా ఆ తర్వాత క్యారెక్టర్ యాక్టర్‌గా విభిన్న పాత్రలు పోషించారు. మాధవన్ కు ఇద్దరు సంతానం కాగా కుమారుడు రాజా కృష్ణ మీనన్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు. హిందీలో పిపా, చెఫ్,ఎయిర్ లిఫ్ట్ వంటి భారీ చిత్రాలను డైరెక్ట్ చేశాడు. కాగా మాధవన్ మరణ వార్త తెలుసుకున్న కేరళ సీఎం పినరయి విజయన్, ఇతర నటులు సంతాపం తెలిపారు.
Read Also : Free Rice Scheme : 2028 డిసెంబరు వరకు ఉచిత బియ్యం పంపిణీ : కేంద్రం