GraamPay : గ్రామ్‌పే ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
GraamPay : గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షితమైన డిజిటల్ లావాదేవీలను అందించేందుకు రూపొందిన ఈ కొత్త సేవ, చిన్న వ్యాపారులు, రైతులు, గ్రామీణ వ్యాపార వర్గాలకు మేలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుంది
- By Sudheer Published Date - 09:12 PM, Wed - 19 March 25

తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, పరిశ్రమలు & వాణిజ్యం, శాసన వ్యవహారాల మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు (D. Sridhar Babu) గారు, వియోనా ఫిన్‌టెక్ ప్రధాన కార్యాలయం(Viyona Fintech’s headquarters)లో గ్రామ్‌పే సేవను(GraamPay ) ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షితమైన డిజిటల్ లావాదేవీలను అందించేందుకు రూపొందిన ఈ కొత్త సేవ, చిన్న వ్యాపారులు, రైతులు, గ్రామీణ వ్యాపార వర్గాలకు మేలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుంది.
భారత జనాభాలో 65%కు పైగా గ్రామీణ ప్రాంతాల్లోనే జీవిస్తున్న నేపథ్యంలో చాలామంది ప్రజలు బ్యాంకింగ్ సేవలను సులభంగా పొందలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు గ్రామ్‌పే డిజిటల్ ఫైనాన్స్‌ను గ్రామాలకు చేరువ చేయనుంది. గ్రామీణ వ్యాపారస్తులు, రైతులు, చిన్నతరహా వ్యాపారులు నగదు వినిమయాన్ని తగ్గించేందుకు, డిజిటల్ లావాదేవీల ద్వారా మరింత భద్రతతో పాటు వేగవంతమైన సేవలను పొందేందుకు ఇది సహాయపడుతుంది.

ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ .. “పేద, ధనిక అనే భేదం లేకుండా ప్రతిఒక్కరికీ ఆర్థిక సేవలు అందించాల్సిన సమయం ఇది. గ్రామ్‌పే వలన గ్రామీణ ప్రజలకు కూడా బ్యాంకింగ్ సౌకర్యాలు సులభంగా అందుబాటులోకి వస్తాయి” అని అన్నారు. ఈ ప్రాజెక్టు ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉపాధి కల్పించే వీఏల్ఈ (విలేజ్ లెవల్ ఎంట్రప్రెన్యూర్స్) మోడల్‌ను అమలు చేయనుంది. వీరు గ్రామీణ ప్రాంత వ్యాపారులను డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలోకి తీసుకువచ్చి, ప్రజలకు అవగాహన కల్పిస్తారు. క్యూఆర్ కోడ్, యూపీఐ పేమెంట్స్, మొబైల్ ఫైనాన్షియల్ సేవల ద్వారా గ్రామీణ వ్యాపారాలు పెరగడంతో పాటు, ఆర్థిక భద్రత పెరుగుతుందని ఆశిస్తున్నారు.