IBM Employees : ఐబీఎం ఉద్యోగులకు షాక్
IBM Employees : క్లౌడ్ క్లాసిక్ విభాగాన్ని ప్రధానంగా ప్రభావితం చేసేలా కంపెనీ భారీ ఉద్యోగాల కోతను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది
- By Sudheer Published Date - 04:52 PM, Tue - 25 March 25

ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాన్ని ఉద్యోగాల కోతలు వణికిస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రముఖ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ (IBM) కూడా ఈ జాబితాలో చేరింది. క్లౌడ్ క్లాసిక్ విభాగాన్ని ప్రధానంగా ప్రభావితం చేసేలా కంపెనీ భారీ ఉద్యోగాల కోతను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ది రిజిస్టర్’ నివేదిక ప్రకారం.. ఈ తొలగింపుల కారణంగా దాదాపు 9,000 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశముంది. గతంలో కూడా ఐబీఎం ఇదే తరహా ఉద్యోగ కోతలు అమలు చేసిన సంగతి తెలిసిందే.
ATM Charges Hike: ఏటీఏం వాడే వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. మే 1 నుంచి ఛార్జీల మోత!
ఈ తొలగింపులు అమెరికాలోని రాలీ, నార్త్ కరోలినా, న్యూయార్క్, డల్లాస్, కాలిఫోర్నియా వంటి ప్రధాన కేంద్రాలను ఎక్కువగా ప్రభావితం చేయనున్నాయి. ముఖ్యంగా కన్సల్టింగ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సేల్స్, ఇంటర్నల్ ఐటీ వ్యవస్థలు, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగాలలో ఉద్యోగ కోతలు అమలు అవుతున్నాయి. కొన్ని విభాగాల్లో 10% మేర ఉద్యోగాలు తగ్గించేందుకు కంపెనీ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ తొలగింపుల గురించి కొంతమంది పర్సనల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోగా, మరికొందరికి ఇంటర్నల్ మీటింగ్స్ ద్వారా సమాచారం అందినట్లు తెలుస్తోంది.
కంపెనీ విధానాలలో మార్పుల కారణంగా ఏప్రిల్ 2025 నాటికి ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయానికి హాజరుకావాల్సిన కొత్త రిటర్న్-టు-ఆఫీస్ విధానం అమల్లోకి వస్తుంది. ఇదిలా ఉంటే ఐబీఎం ఇండియాలో ఉన్న ఉద్యోగులకు ఈ తొలగింపుల ప్రభావం ఉంటుందా? అనే విషయంపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. టెక్ రంగంలో మాంద్యం కారణంగా అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న వేళ, ఐబీఎం తాజా నిర్ణయం ఉద్యోగులకు పెద్ద షాకే అని చెప్పుకోవచ్చు.