Bank Merger : దేశీయ బ్యాంకింగ్ రంగంలో మరో రెండు బ్యాంకులు విలీనం
Bank Merger : ఈ రెండు బ్యాంకుల స్వచ్ఛంద విలీనానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ఆమోదం తెలిపింది. గత నెల జులై లో ఈ విలీనానికి ప్రతిపాదన రాగా, సెంట్రల్ బ్యాంక్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఈ రెండు బ్యాంకుల విలీనం ఆగస్టు 4, 2025 నుంచే అమలులోకి వస్తుంది
- By Sudheer Published Date - 02:46 PM, Sat - 2 August 25

దేశీయ కోఆపరేటివ్ బ్యాంకింగ్ రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (NICBL) మరియు సరస్వత్ కోఆపరేటివ్ బ్యాంకులు విలీనం (Saraswat Bank New India Bank Merger) కానున్నాయి. ఈ రెండు బ్యాంకుల స్వచ్ఛంద విలీనానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ఆమోదం తెలిపింది. గత నెల జులై లో ఈ విలీనానికి ప్రతిపాదన రాగా, సెంట్రల్ బ్యాంక్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఈ రెండు బ్యాంకుల విలీనం ఆగస్టు 4, 2025 నుంచే అమలులోకి వస్తుంది.
బ్యాంకు డిపాజిటర్లకు భద్రత కల్పించడం, బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా కొనసాగించడం, కోఆపరేటివ్ బ్యాంకింగ్ సెక్టార్‌పై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించడం వంటి లక్ష్యాలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా, న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్‌లో తలెత్తిన పాలనా పరమైన సమస్యలను పరిష్కరించడమే ఈ విలీనానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ విలీనం కేవలం వ్యాపార విస్తరణ కోసమే కాకుండా, రెండు బ్యాంకుల్లో తలెత్తిన సంక్షోభాలకు పరిష్కారం చూపేందుకే జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క అన్ని ఆస్తులు, బాధ్యతలను సరస్వత్ బ్యాంక్ చేపడుతుంది. అలాగే న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్‌కు చెందిన అన్ని శాఖలు సరస్వత్ బ్యాంక్ పరిధిలో పని చేస్తాయి.
Biryani : అబ్బ.. అని లొట్టలేసుకుని తిన్నారో అంతే సంగతి !!
ఈ విలీన ప్రక్రియను పూర్తి చేయడానికి బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 56, సెక్షన్ 44ఏ సబ్ సెక్షన్ 4 కింద లభించిన అధికారాల మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఆమోదాన్ని తెలిపింది. న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ డిపాజిటర్లు, ఇతర కస్టమర్లకు ఆగస్టు 4, 2025 నుంచి సరస్వత్ బ్యాంక్ సేవలందిస్తుంది. వారి డిపాజిట్లకు, ఇతర ప్రయోజనాలకు పూర్తి రక్షణ ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఇది డిపాజిటర్లలో భద్రతా భావాన్ని కలిగిస్తుంది.
వాస్తవానికి న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌లో రూ. 122 కోట్ల స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి, 2025లో NICBL పై RBI నిఘా పెట్టింది. సీనియర్ మేనేజ్‌మెంట్ సభ్యులకు ఈ రూ. 122 కోట్ల నిధుల దుర్వినియోగానికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో, ఫిబ్రవరి నుంచే న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ RBI నియంత్రణా పరిశీలనలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే సరస్వత్ బ్యాంకులో విలీనం చేసేందుకు చర్యలు చేపట్టగా, ఇప్పుడు RBI పచ్చజెండా ఊపడంతో ఈ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ విలీనం కోఆపరేటివ్ బ్యాంకింగ్ రంగంలో స్థిరత్వాన్ని పెంచే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతోంది.