‘Aakash’ Educational Gift : దేశ రక్షణ దళాలకు ‘ఆకాశ్’ విద్యా కానుక
విధి నిర్వహణలో మరణించిన సైనికులు మరియు ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది పిల్లలకు కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు మినహా మిగిలిన అన్ని కోర్సు ఫీజుల నుండి 100% పూర్తి మినహాయింపు లభిస్తుంది
- Author : Sudheer
Date : 29-05-2026 - 7:57 IST
Published By : Hashtagu Telugu Desk
‘Aakash’ Educational Gift : భారతదేశ సరిహద్దులను కాపాడే సైనికులు మరియు పారామిలిటరీ దళాల కుటుంబాల్లో విద్యా వెలుగులు నింపేందుకు ప్రముఖ పరీక్షల సన్నాహక సంస్థ ‘ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్’ (AESL) ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న భారత సైన్యం (Indian Army)తో పాటు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) దళాలతో ఆకాశ్ సంస్థ చారిత్రాత్మక అవగాహన ఒప్పందాలను (MoUs) కుదుర్చుకుంది. హైదరాబాద్ వేదికగా మే 29, 2026న ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న సైనికులు, మాజీ సైనికులు, శౌర్య పురస్కార గ్రహీతలు, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల పిల్లల విద్యా ఆకాంక్షలకు పూర్తి అండగా నిలవడమే ఈ భాగస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇంజనీరింగ్, మెడికల్ వంటి ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే రక్షణ దళాల పిల్లలకు ఆర్థిక అడ్డంకులు లేకుండా నాణ్యమైన కోచింగ్‌ను అందించేందుకు ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని రూపొందించారు.
ఈ ప్రత్యేక ఒప్పందం ప్రకారం వివిధ రక్షణ దళాల సిబ్బంది పిల్లలకు ట్యూషన్ ఫీజులో భారీగా మినహాయింపులు లభించనున్నాయి. విధి నిర్వహణలో మరణించిన సైనికులు మరియు ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది పిల్లలకు కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు మినహా మిగిలిన అన్ని కోర్సు ఫీజుల నుండి 100% పూర్తి మినహాయింపు లభిస్తుంది. అలాగే, 20% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న సైనికుల పిల్లలకు, శౌర్య పురస్కార గ్రహీతలకు ట్యూషన్ ఫీజులో 90% నుండి 100% వరకు రాయితీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న మరియు రిటైర్డ్ సిబ్బంది పిల్లలకు సైతం ట్యూషన్ ఫీజుపై 20% నుండి 22% వరకు అదనపు స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌లతో పాటు విద్యార్థులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా కెరీర్ గైడెన్స్, నేషనల్ లెవెల్ స్కాలర్‌షిప్ టెస్ట్ (ANTHE) రాసే అవకాశం మరియు దీర్ఘకాలిక విద్యా మద్దతును అందించనున్నారు. దేశ సేవలో తరిస్తున్న సైనిక కుటుంబాలకు తిరిగి సేవ చేసేందుకు ఇదొక గొప్ప అవకాశమని ఆకాశ్ సంస్థ ఎండీ & సీఈఓ శ్రీ చంద్ర శేఖర్ గరిస రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాబోయే 3 నుండి 5 ఏళ్ల పాటు ఈ పథకం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆకాశ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటుంది.