IndiGo Flight Disruptions : రెండో రోజు కూడా విమానాల రద్దు.. ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల గందరగోళం
IndiGo Flight Disruptions : గత కొద్ది రోజులుగా ఇండిగో (IndiGo) విమానయాన సంస్థ అంటేనే విమాన ప్రయాణికుల్లో తీవ్రమైన ఆందోళన, భయం, ఆగ్రహం పెరిగిపోతున్నాయి. వరుసగా చోటుచేసుకుంటున్న సంఘటనలు ఈ పరిస్థితికి దారి తీస్తున్నాయి
- Author : Sudheer
Date : 04-12-2025 - 10:45 IST
Published By : Hashtagu Telugu Desk
గత కొద్ది రోజులుగా ఇండిగో (IndiGo) విమానయాన సంస్థ అంటేనే విమాన ప్రయాణికుల్లో తీవ్రమైన ఆందోళన, భయం, ఆగ్రహం పెరిగిపోతున్నాయి. వరుసగా చోటుచేసుకుంటున్న సంఘటనలు ఈ పరిస్థితికి దారి తీస్తున్నాయి. పలుచోట్ల విమాన ప్రమాదాలు సంభవించడం, మరికొన్ని చోట్ల సాంకేతిక లోపాలు తలెత్తడం, విమానాల ఆలస్యాలు వంటి ప్రతికూల వార్తలు తరచూ వెలుగులోకి వస్తుండడంతో, ఇండిగో విమానంలో ప్రయాణించాలంటేనే ప్రయాణికులు ‘వామ్మో’ అనే స్థాయికి చేరుకున్నారు. ఇలాంటి అనుమానాలు, అపనమ్మకాల మధ్య, గత రెండు రోజులుగా సాంకేతిక సమస్యల కారణంగా ఇండిగో సంస్థ విమాన సర్వీసులు రద్దు అవుతుండడం ప్రయాణికుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచుతోంది. విమాన ప్రయాణంపై భరోసా కరువై, సురక్షితమైన గమ్యస్థానం చేరుకోగలమా అనే సందేహం ప్రయాణికులను వేధిస్తోంది.
Balakrishna : అలాంటి డైరెక్టర్లతోనే వర్క్ చేస్తా – బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు
తాజాగా సిబ్బంది కొరత మరియు ఇతర నిర్వహణపరమైన సమస్యల కారణంగా ఇండిగో సంస్థ వరుసగా రెండో రోజూ కూడా భారీ సంఖ్యలో విమాన సర్వీసులను రద్దు చేసింది. దీని ఫలితంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లోని విమాన సేవల్లో తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ఊహించని ఈ రద్దుల వల్ల వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు, వారి ప్రయాణ ప్రణాళికలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన 33 సర్వీసులు, ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన 30 సర్వీసులు రద్దు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. నిన్నటి రోజున దాదాపు 200 వరకు విమానాలు రద్దవగా, ఇవాళ మరో 170 వరకు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Rahul Gandhi : త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించబోతున్న రాహుల్ గాంధీ!
ఇండిగో సంస్థ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం కేవలం ఆ సంస్థ ప్రయాణికులనే కాక, దేశీయ విమానయాన వ్యవస్థ మొత్తంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఇంత పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు కావడం వలన, ముఖ్యమైన నగరాల మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. అత్యవసర పనులు, వైద్య చికిత్సలు, వ్యాపార సమావేశాల కోసం బయలుదేరిన వారు గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, నష్టపరిహారం చెల్లించడం వంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఈ వరుస అంతరాయాలు ఇండిగో సంస్థ ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు, భవిష్యత్తులో ప్రయాణాల కోసం ఇతర విమానయాన సంస్థలను ఎంచుకోవడానికి ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది. సంస్థ వెంటనే సమస్యలను పరిష్కరించి, ప్రయాణికులకు భరోసా ఇవ్వాల్సిన తక్షణ అవసరం ఉంది.