YS Vivekananda Reddy : వివేక హంతకుడు ఆయనే.?
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దాదాపు కొలిక్కి వస్తోంది.
- By CS Rao Published Date - 02:44 PM, Wed - 23 February 22

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దాదాపు కొలిక్కి వస్తోంది. కారు డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాగ్మూలం ఇప్పుడు వైసీపీని ఇరుకునపెడుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ ఆ హత్య కేసు తిరుగుతోంది. ఎంపీ అభ్యర్థిత్వం విషయంలో ఇద్దరి మధ్యా పొడచూపిన వివాదం కారణంగా వివేక హత్య చోటుచేసుకుందని దస్తగిరి ఇచ్చిన వాగ్మూలం ప్రకారం సీబీఐ ప్రాథమిక నిర్థారణకు వస్తోంది.వివేకానందరెడ్డి వద్ద కారు డ్రైవర్ గా ఉన్న దస్తగిరి ఇటీవల అప్రూవర్ గా మారిన విషయం విదితమే. ఆయనిచ్చిన వాగ్మూలం ప్రకారం చార్జిషీట్ ను తయారు చేసిన సీబీఐ ఒక నిర్థారణకు వచ్చిందని తెలుస్తోంది. అంతేకాదు, భరత్ అనే వ్యక్తి హెలిప్యాడ్ వద్దకు రావాలని ఆదేశించినట్టు దస్తగిరి తాజా వాగ్మూలంలో తెలపడం సంచలనం కలిగిస్తోంది. ఆ మేరకు హెలిప్యాడ్ వద్దకు వెళ్లగా.. భరత్‌తో పాటు ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డితో పాటు ఆయన న్యాయవాది ఓబుల్ రెడ్డి ఉన్నారని వాగ్మూలం ఇచ్చాడు.
వివేక హత్య కేసులో నిందితునిగా భరత్ యాదవ్ కీలకంగా ఉన్నాడు. ఆయన దస్తగిరి ఇచ్చిన వాగ్మూలాన్ని కొట్టిపారేశాడు. అంతేకాదు, దస్తగిరి మాట్లాడిన ఓ ఆడియోను భరత్ యాదవ్ బుధవారం విడుదల చేయడంతో మరింత హీటెక్కింది. దస్తగిరి ఆరోపణలు నిజం కాదని భరత్ అంటున్నాడు. అప్రూవర్ గా మారాక ఎందుకు బెదిరిస్తారని ప్రశ్నించాడు. మామిడి తోట వద్దకు దస్తగిరిని ఎవరూ రమ్మనలేదని చెబుతున్నాడు. లాయర్ ఓబుల్ రెడ్డిని కలవాలంటూ దస్తగిరికి చెప్పలేదని అన్నాడు. కేవలం డబ్బుల కోసమే దస్తగిరి ఆరోపణలు చేస్తున్నాడని భరత్ అంటున్నాడు.తొలి నుంచి వివేక హత్య కేసులో ఇరికిస్తానని దస్తగిరి బెదిరించే వాడని భారత్ ఆరోపిస్తున్నాడు. వైఎస్ కుటుంబ సభ్యులను ఈ కేసులో ఇరికిస్తానంటూ బెదిరించేవాడని భారత్ యాదవ్ అంటున్నాడు. కాగా, ఆయన విడుదల చేసిన ఆడియోను గమనిస్తే చాలా క్లోజ్ గా ఉంటూ మాట్లాడినట్టు కనిపిస్తోంది. ఇలా రోజుకో రకంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు మలుపులు తిరుగుతోంది. సీబీఐ విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఆనాడు పులివెందుల సీఐగా ఉన్న జె.శంకరయ్య ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. ఎంపీ అవినాష్ ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కలిసి వివేక హత్య కేసు నమోదు చేయడానికి లేదని హుకుం జారీ చేశారని శంకరయ్య సీబీఐకి వాగ్మూలం ఇచ్చాడు.
మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించొద్దని ఆదేశించారని సీఐ చెప్పడం కలకలం రేపుతోంది. హత్యకు సంబంధించిన ఆధారాలను అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి పర్యవేక్షణలోనే ధ్వంసం చేయడం జరిగిందని వివరించాడు. రక్తపు వాంతులు, గుండెపోటుతో వివేకానందరెడ్డి మృతి చెందినట్టు అవినాష్‌రెడ్డి ఆయన పీఏ రాఘవరెడ్డి ఆ రోజు ఫోన్ చేశారని శంకరయ్య చెప్పాడు. హత్య జరిగిన ప్రదేశంలో ఆనవాళ్లను ధ్వంసం చేస్తున్న సమయంలో ఇంట్లోకి ఎవరూ ప్రవేశించకుండా భాస్కరరెడ్డి తలుపులు మూసివేశారని శంకరయ్య సీబీఐకి వివరించినట్టు తెలుస్తోంది.రక్తపు మరకలను శుభ్రం చేసి, గాయాలకు కట్లుకట్టే సిబ్బందినే మాత్రమే లోపలికి అనుమతించారని శంకరయ్య చెప్పాడు. హత్య కేసు నమోదు చేయొద్దని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఒత్తిడి తెచ్చిన విషయాన్ని ఆనాటి కడప ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ దృష్టికి తీసుకెళ్లినట్టు సీబీఐకి చెప్పాడు. ఆయన ఆదేశాల మేరకు మృతి చెందినట్టు కేసు నమోదు చేశానని శంకరయ్య చెప్పడం సంచలనం కలిగిస్తోంది. ఆ మేరకు 28 జులై 2020న సీబీఐ అధికారుల ఎదుట శంకరయ్య ఇచ్చిన ఈ సంచలన వాంగ్మూలం ప్రకంపనలు రేపుతోంది.వివేకా కారు డ్రైవర్‌గా పనిచేసిన దస్తగిరి రెండో దఫా తన వాంగ్మూలాన్ని ఇవ్వగా.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందంలోని అధికారి రాంసింగ్‌పై ఏకంగా కేసు నమోదు కావడం సంచలనం రేపుతోంది. సాక్ష్యులను బెదిరించడానికి రాంసింగ్ సిద్ధపడ్డాడని ఫిర్యాదు వెళ్లింది. వివేకా హత్య కేసు దర్యాప్తులో తాము చెప్పినట్లుగానే చెప్పాలని రాంసింగ్ బెదిరిస్తున్నారని ఉదయ్ కుమార్ రెడ్డి ఆరోపించాడు. ఆ మేరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. కడప రిమ్స్ స్టేషన్‌లో రాంసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
దస్తగిరికి నిందితుడు భరత్ యాదవ్ 10 ఎకరాల పొలంతో పాటు అడిగినంత డబ్బు ఆఫర్ చేశాడట. అదే విషయాన్ని సీబీఐకి ఫిర్యాదు చేసినట్లుగా దస్తగిరి వెల్లడించాడు. ఈ కేసులో గతేడాది ఆగస్ట్ 25న అప్రూవర్‌గా మారిన దస్తగిరి సీబీఐకి స్టేట్ మెంట్ ఇచ్చాడు. అదే విషయాన్ని ఆ నెల 31న జమ్మలమడుగు కోర్టులో ఒప్పుకున్నాడు. కాగా తనను భరత్ తదితరులు కలిసి ప్రలోభానికి గురి చేసినట్టుగా సెప్టెంబర్ 30న సీబీఐకి దస్తగిరి ఫిర్యాదు చేశారు. ఈ విషయాలన్నింటిని తాజా వాంగ్మూలంలో దస్తగిరి పేర్కొనడం ప్రకంపనలు సృష్టిస్తోంది. మొత్తం మీద దస్తగిరి, ఆనాటి సీఐ శంకరయ్య ఇచ్చిన వాగ్మూలం మేరకు కడప ఎంపీ అవినాష్ మెడకు వివేకానందరెడ్డి హత్య కేసు చుట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది. చివరకు సీబీఐ ఏం తేల్చనుందో చూద్దాం.!