YS Sharmila Rakhi: అన్నా చెల్లెలు ‘వివాదం’ రాఖీ
రాఖీ పండుగ సందర్భంగా వైస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్యుల్లోనూ చర్చకు దారితీసింది.
- By CS Rao Published Date - 11:37 PM, Fri - 12 August 22

రాఖీ పండుగ సందర్భంగా వైస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్యుల్లోనూ చర్చకు దారితీసింది. నేరుగా అన్నకు శుభాకాంక్షలు చెప్పే చొరవ లేకపోవటంతో జగన్ తో ఉన్న రక్తసంబంధాన్ని ట్వీట్ రూపంలో పరోక్షంగా గుర్తు చేయడం గమనార్హం.
సోషల్ మీడియాలో కూడా చెల్లి షర్మిలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు చెప్పలేదు. కానీ,షర్మిల మాత్రం అన్న జగన్ పేరెత్తకుండా, అందరితో కలిపి రాఖీ శుభాకాంక్షలు పరోక్షంగా చెప్పారు. ” నా తోడబుట్టిన అన్నతోపాటు నా ఈ ప్రజాప్రస్థాన పాదయాత్రలో 1600 కిలోమీటర్ల పైగా నాతో నడిచి, నాకు దేవుడిచ్చిన తోబుట్టువుల్లా రక్షణగా నిలిచిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు..” అని ట్వీట్ చేయడం వైఎస్ అభిమానులను ఆలోచింప చేస్తుంది. ఎక్కడా జగన్ పేరు రాయలేదు. అలాగే ట్వీట్‌ను కూడా జగన్‌కు ట్యాగ్ చేయలేదు. రాఖీ సందర్భంగా వైఎస్ జగన్ కానీ, వైసీపీ కానీ ఎక్కడా షర్మిల పేరును రాఖీ సంబరాల్లో తీసుకు రాలేదు. ప్రతీ సారి పెట్టే ఫోటోలు ఈ సారి కనిపించనీయలేదు. రాజకీయం వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు. కుటుంబం వేరు. ఆ విషయంలో సీఎం జగన్ మాత్రం వ్యక్తిగతంగానూ కుటుంబపరంగా కూడా సోదరికి దూరమైనట్లుగా రాఖీ పండుగ ధ్రువపరుస్తుంది.
రాఖీ పండుగ వస్తే, వైసీపీ నేతలకు వారి అనుబంధ మీడియాకు కానీ జగన్- షర్మిల అనుబంధం చూపించడానికి స్పెషల్ ఎపిసోడ్లు నడిపే వాళ్ళు. షర్మిల, జగన్ మధ్య రాఖీ అనుబంధం లైవ్‌లో చూపించేవారు. రాఖీలు కట్టే ఫోటోలు వైరల్ అయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గత రెండేళ్ల నుంచి సీన్ రివర్స్ అయింది. కనీసం సోషల్ మీడియాలో కూడా చెల్లి షర్మిలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు చెప్పలేదు. షర్మిల మాత్రం అన్న జగన్ పేరెత్తకుండా.. అందరితో కలిపి అయినా రాఖీ శుభాకాంక్షలు చెబూతు ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.