Gannavaram : రేపు ముఖ్య అనుచరులతో వైసీపీ నేత యార్లగడ్డ భేటీ.. టీడీపీలో చేరికకు సిద్ధం..?
ఇటీవల కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించిన గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు రేపు మరోసారి సమావేశం
- By Prasad Published Date - 09:40 PM, Thu - 17 August 23

ఇటీవల కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించిన గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు రేపు మరోసారి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సారి ముఖ్య అనుచరులతో ఆయన సమావేశం అవుతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యచరణ ప్రకటించే అవకాశం ఉందని ఆయన అనుచరులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచే తాను పోటీ చేస్తానని ఆత్మీయ సమావేశంలో తేల్చి చెప్పారు. అయితే ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తారా లేదా అనేది మాత్రం స్ఫష్టం కాలేదు. గన్నవరం నుంచి వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీకి టికెట్ ఖరారు అయింది. ఈ నేపథ్యంలోనే యార్లగడ్డ వెంకట్రావు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైయ్యారు. ఆత్మీయ సమావేశం పేరుతో యార్లగడ్డ వెంకట్రావు తన బలాన్ని చూపించుకున్నారు. అయినప్పటికి వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి బుజ్జగింపులు జరగలేదు.పైగా పార్టీలో ఉండలేని వారు వెళ్లిపోవచ్చు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అసంతృప్తి నేతలకు కౌంటర్ ఇచ్చారు. దీంతో యార్లగడ్డ పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నెల 19వ తేదీన నారా లోకేష్ పాదయాత్ర గన్నవరంలో జరగనుంది. అక్కడ జరిగే బహిరంగ సభలోనే యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరే అకాశం ఉన్నట్లు తెలుస్తోంది.