Video:హృదయవిదారక దృశ్యం – వరదలో కొట్టుకుపోయిన భర్త కోసం గాలిస్తున్న భార్య
కడప జిల్లా రాజంపేటలో హృదయవిదారకమైన సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లాలో జనజీవనం స్తంభించింది.
- Author : Hashtag U
Date : 26-11-2021 - 3:12 IST
Published By : Hashtagu Telugu Desk
కడప జిల్లా రాజంపేటలో హృదయవిదారకమైన సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లాలో జనజీవనం స్తంభించింది. రాజంపేటలోని అన్నమయ్య ప్రాజెక్టు మట్టి కట్ట తెగిపోవడంతో చెయ్యేరు వరదలో కొట్టుకుపోయిన తన భర్త షేక్ రషీద్ కోసం ఆయేషా గత వారం రోజులుగా వెతుకుతుంది. గుండ్లూరు గ్రామానికి చెందిన రషీద్ నందలూరులోని కేబుల్ టీవీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు షేక్ రుబీనా (22), షేక్ హుస్సేన్ (16), షేక్ నూర్ హుస్సేన్ (9) ఉన్నారు. చెయ్యేరు ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన 38 గ్రామస్తులలో ఇతను ఒకడు. వరదలో తప్పిపోయిన 38 గ్రామస్తుల్లో 11 మంది ఇప్పటికీ జాడ తెలియలేదు. వరదలు గ్రామాన్ని ముంచెత్తుతాయని తెలుసుకున్న తర్వాత రషీద్ ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. దాదాపు ఇంటికి చేరుకునే సమయంలోనే తన ఇంటి దగ్గర ఒక గుంంటలో జారి పడి కొట్టుకుపోయాడని తన భార్య ఆయేషా తెలిపింది. రషీద్ తన కళ్ల ముందే కొట్టుకుపోవడం చూసిన ఆయేషా భోరున విలపించింది.
రషీద్ ఫోటోను పట్టుకుని, ఆయేషా తన భర్త ఆచూకీ గురించి అందరినీ అడుగుతుండటం అందరి హృదయాలను కలిచివేస్తుంది. అన్నమయ్య ప్రాజెక్ట్ దిగువన రెండు మృతదేహాలను కనుగొన్నామని…వాటిలో ఒకటి రషీద్‌దేనా అని గుర్తించమని తనను పోలీసులు అడిగారని ఆమె తెలిపింది. ఆ ప్రదేశానికి పరుగెత్తి వెళ్లినప్పటికీ అక్కడ మృతదేహం కనిపించలేదని ఆయేషా బాధపడింది. రషీద్ కోసం గాలింపు కొనసాగిస్తున్నామని మన్నూరు ఎస్‌ఐ భక్తవత్సలం తెలిపారు. వరదల్లో మొత్తం 38 మంది కొట్టుకుపోయినట్లు సమాచారం. మేము ఇప్పటివరకు 27 మంది బాధితుల మృతదేహాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నాము.