YCP vs TDP : రాణిగారితోటలో రసవత్తర రాజకీయం.. దేవినేని, గద్దె వివాదంలోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన యలమంచిలి
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. నియోజకవర్గంలోని రాణిగారితోట ప్రాంతంలో వైసీపీ
- By Prasad Published Date - 08:59 AM, Wed - 11 January 23

YCP vs TDP: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. నియోజకవర్గంలోని రాణిగారితోట ప్రాంతంలో వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ గడపగడపకు వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఆ సమయంలో స్థానికులు వైసీపీ కార్పోరేటర్ తంగిరాల రామిరెడ్డిని తమకు ఏ పని చేశావంటూ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ ముందే నిలదీశారు. ఆ తరువాత మరుసటి రోజు ప్రశ్నించిన మహిళపై కార్పోరేటర్ మనుషులు దాడికి పాల్పడ్డారు. దీంతో వివాదం మరింత ముదిరి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చేరింది.
టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బాధిత మహిళ తరుపున స్టేషన్‌కు వెళ్లి వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. ఇదంతా ఇలా ఉంటే ఈ వివాదంలోకి మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి సడెన్ ఎంట్రీ ఇచ్చారు. ఇంఛార్జ్ అవినాష్‌పై తీవ్ర స్థాయిలో యలమంచిలి రవి మండిపడ్డారు. బాధితులు వైసీపీ పార్టీలో పని చేసినవారని.. వారంతా తన అనుచరులంటూ యలమంచిలి రవి తెలిపారు.
సొంత పార్టీకి చెందిన వారినే వేధించడం మంచి పద్ధతికాదన్నారు. వైసీపీ కార్పోరేటర్ తంగిరాల రామిరెడ్డి గెలుపుకు బాధితులంతా పని చేశారని తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి తీసుకెళ్తానని యలమంచిలి రవి తెలిపారు.